https://oktelugu.com/

YCP Social Media : అరెస్టులపై తగ్గేదేలె.. రెడీ అయిపోతున్న వైసీపీ.. పెద్ద ప్లానే వేసిందిగా*

ఆది నుంచి వైసీపీకి సోషల్ మీడియా వింగ్ బలం. మొదటిసారి ఓడిపోయిన జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లారు. కానీ ఈ ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టుకున్నారు. మరోసారి అదే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచాలని భావిస్తున్నారు. కానీ కూటమి ఈ సోషల్ మీడియా పై ఉక్కు పాదం మోపుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2024 11:41 am
    YCP Social Media

    YCP Social Media

    Follow us on

    YCP Social Media :  రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా వైసీపీకి మద్దతుగా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. నీచాతి నీచంగా కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి వ్యక్తిగత జీవితం పై మాట్లాడిన వారు ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ పరంపర కొనసాగుతోంది. పోలీసుల ఉదాసీనతపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. దీంతో పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ లోకి దిగారు. రోజుకు వందలాది మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. పంచ్ ప్రభాకర్, ఇంటూరి కిరణ్, వర్ర రవీందర్ రెడ్డి లాంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండడంతో హై కమాండ్ స్పందించింది. వారందరికీ భరోసా ఇస్తోంది. మిమ్మల్ని టచ్ చేసిన మరుక్షణం లీగల్ టీం వస్తుందని వైసీపీలో యాక్టివ్ గా పని చేసే మాజీ ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లో తగ్గవద్దని సోషల్ మీడియా ప్రతినిధులకు సూచించారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులను టచ్ చేసే పోలీసులకు భవిష్యత్తులో మూల్యం తప్పదని హెచ్చరికలు పంపారు.

    * ముందే గ్రహించిన జగన్
    వైసీపీ సోషల్ మీడియా పై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని జగన్ కు ముందే తెలుసు. అందుకే కొద్ది రోజుల కిందట సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పిలుపు ఇచ్చారు జగన్. పార్టీలో యాక్టివ్ గా ఉండేవాళ్లు సోషల్ మీడియా ప్రతినిధులుగా మారాలని సూచించారు. అందుకు తప్పకుండా ప్రతిఫలం ఉంటుందని చెప్పారు.భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో చాలామంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు వివిధ పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు ఉండేవి. అటువంటి వారిపై నిఘా పెరగడంతో ఇప్పుడు పేర్లు మార్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటువంటి వాటిని గుర్తించి ఇప్పుడు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

    * స్థానిక పరిస్థితులకు తగ్గట్టు
    అయితే ఎక్కడికి అక్కడే స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా పోలీసులతో సర్దుబాటు చేసుకోవాలని వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. నిన్న కడపలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 41 నోటీసులు ఇచ్చి వదిలేశారు. మరోవైపు బూరగడ్డ అనిల్ కుమార్ అరెస్టు సమయంలో కొంతమంది పోలీసులు ఆయనతో లాలూచీ పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిపై కూడా వేటు పడింది. అయితే ఇదంతా స్థానిక పోలీస్ శాఖలో సర్దుబాటుతోనే సాధ్యమవుతోందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు అటువంటి ప్రయత్నాలకు చెక్ చెబుతోంది పోలీస్ శాఖ. ఈ తరుణంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో వైసిపి లీగల్ టీం రెడీ అవుతోంది. మీకు అన్ని విధాలుగా న్యాయ సహాయం అందిస్తాము రెచ్చిపోండి అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైసిపి యుద్ధానికి రెడీ అవుతుందన్నమాట.