AP Assembly Session 2024: తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వీడియో వైరల్

పవన్ మాట్లాడుతూ..' సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ గా రావడం సంతోషం. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు.

Written By: Dharma, Updated On : June 22, 2024 1:53 pm

AP Assembly Session 2024

Follow us on

AP Assembly Session 2024: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పవన్. రెండో ప్రయత్నం గా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాను సైతం సొంతం చేసుకున్నారు. నిన్ననే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో మాట్లాడారు. స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నియామకంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత దూషణలతో, బూతులతో పవిత్రమైన అసెంబ్లీని అపవిత్రం చేశారని.. దానిని అధిగమించి గౌరవ సభగా మార్చేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కేవలం విజయాన్ని మాత్రమే ఆహ్వానించిన వైసిపి.. ఓటమిని తట్టుకోలేక పోయిందని.. అందుకే సభకు గైర్హాజరయిందని తప్పుపట్టారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియామకం పై పవన్ చేసిన ప్రసంగం సభ్యులను ఆకట్టుకుంది. ఆ వీడియో సైతం వైరల్ గా మారింది.

పవన్ మాట్లాడుతూ..’ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ గా రావడం సంతోషం. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది. భాష మనసులను కలపడానికే..విడగొట్టడానికి కాదు. ఎంతటి సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు ‘ అని పవన్ స్పష్టం చేశారు. పవన్ ప్రసంగిస్తున్నంత సేపు సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తిగా విన్నారు. సభ్యులు సైతం కరతాల ధ్వనులతో ఆహ్వానించారు.

అయితే పవన్ ఒకచోట చలోక్తి విసరడంతో సభలో నవ్వులు పూశాయి. ఇన్నాళ్లు ఆయన వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారు.’ కానీ ఒకటే బాధేస్తోంది సార్. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు’ అని అయ్యన్నను ఉద్దేశించి పవన్ అనడంతో సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. నిన్న ప్రమాణ స్వీకారానికి పరిమితమైన పవన్ ఈరోజు అధ్యక్షా అనేసరికి జనసైనికులు పులకించుకుపోయారు. రాష్ట్రం గురించి బాధ్యతగా మాట్లాడేసరికి ఆనందించారు. ఇది కదా ఈ రాష్ట్రానికి కావలసింది అంటూ పవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.