CM Chandhrababu : చంద్రబాబుపై ఒక అపవాదు ఉంది. సంక్షేమానికి బాబు దూరంగా ఉంటారు. ప్రజలకు ఉచితంగా, ఉదారంగా ఇచ్చేందుకు ఆయనకు మనసు అంగీకరించదు. అభివృద్ధి చేస్తారన్న మంచి పేరు ఉంది. పాలనా దక్షుడు అన్న ఇమేజ్ ఉంది. కానీ సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడా లేని విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం జరుగుతోంది చంద్రబాబుపై. ఈ ఎన్నికల్లో అంతులేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. కానీ వాటి అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం జాప్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. కానీ ఇంకా సంక్షేమ బాట పట్టలేదు. ఒక్క పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేశారు. జూలై 1న పంపిణీ చేశారు. సంక్షేమంలో చేసింది అది ఒక్కటి మాత్రమే. అది ప్రతినెలా అందించాల్సి ఉండడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయగలిగారు. కానీ తల్లికి వందనం, మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.. వంటి పథకాలు కనీసం కార్యాచరణకు కూడా నోచుకోవడం లేదు. దానిపై కసరత్తు కూడా జరగడం లేదు. ఈ తరుణంలో చంద్రబాబు అమలు చేస్తారా? చేయలేరా? చేసే ఉద్దేశం లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వైసీపీ సర్కార్ వైఫల్యాలను తెలియజేప్పలా శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ దాదాపు పది లక్షల వరకు అప్పు చేసిందని.. వాటిని చూస్తే భయమేస్తోందని.. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలకు హామీలు ఇచ్చామని.. వాటిని ఎలా అమలు చేయడం లేదని.. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. సంక్షేమ పథకాలకు చెక్ చెప్పేందుకే చంద్రబాబు ఇతర ప్రకటనలు చేసి ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ దీనిపైనే ప్రచారం ప్రారంభించింది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు, శాసనసభలో చంద్రబాబు ప్రకటనలను జతచేస్తూ.. అప్పుడే వెన్నుపోటు పొడిచారు అంటూ ప్రచారం చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో ఇది హైలెట్ అవుతోంది.
* సంక్షేమానికి చిరునామా వైయస్సార్
ఏపీలో 2004 వరకు ఒక ఎత్తు.. అటు తరువాత మరో ఎత్తు. చంద్రబాబు నుంచి అధికారం స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేసి చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి వాటితో తిరుగులేని సంక్షేమ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణంతో.. తరువాత బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రులు ఆ పథకాలను కొనసాగించాల్సి వచ్చింది. అయితే అధికారం కోసం చంద్రబాబు సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేక పరిస్థితులతో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీనియారిటీ అవసరం ఏర్పడింది. కానీ ఐదేళ్లు తిరగకముందే చంద్రబాబు మరోసారి ప్రజలకు దూరమయ్యారు. జగన్ కు అధికారాన్ని అప్పగించారు.
* సంక్షేమంలో జగన్ కు మంచి మార్కులు
గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించగలిగారు జగన్. కానీ అభివృద్ధి విషయంలో వెనుకబడ్డారు. సంక్షేమంతో సమానంగా అభివృద్ధిని పరుగులెట్టించలేకపోయారు. అది ఆయన వైఫల్యంగా మారింది. దీనికి తోడు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం తోడైంది. అన్నింటికీ మించిరెట్టింపు సంక్షేమ పథకాలను ప్రకటించారు చంద్రబాబు. సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీలను నమ్మిన ప్రజలు చంద్రబాబుకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు.
* చంద్రబాబుపై అనుమానాలు
అయితే చంద్రబాబు సంక్షేమ పథకాలకు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లింక్ చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వ పాలనకు 50 రోజులు గడిచిపోయాయి.హామీల అమలు లేకుండా పోయింది. అసలు అమలు చేసే ఉద్దేశం ఉందా? లేదా? అన్న అనుమానాలు కలిగేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. సంపద సృష్టించి పథకాలు అందిస్తానని ప్రకటించిన చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూస్తే ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించడం ఈ అనుమానాలను పెంచుతోంది. అప్పుడే వెన్నుపోటు పొడిచారు అంటూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వెన్నుపోటు పొడుస్తావని తెలుసుగానీ మరీ ఇంత తొందరగా పొడుస్తావని ప్రజలు గ్రహించలేకపోయారు చంద్రబాబూ! #MosagaduBabu #UturnBabu
ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత pic.twitter.com/ENp1S0NpIA
— Jagananna Connects (@JaganannaCNCTS) July 26, 2024