AP Elections 2024
AP Elections 2024: ఏపీలో ఎన్నికల వాతావరణం పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అధికార, ప్రతిపక్షాలు నువ్వా , నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని వైసిపిని.. కూటమి నేతలు విమర్శిస్తుంటే.. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అడ్డుకుంటుందని కూటమిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ.. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? అనే ప్రశ్నకు ఇండియా టుడే సర్వేరూపంలో సమాధానం లభించింది. అంతేకాదు.. ఆ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు కూడా ఏ పార్టీ గెలుచుకుంటుందో ఒక స్పష్టత వచ్చింది.
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంగతి కాస్త పక్కన పెడితే.. దక్షిణాదిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్లో అధికారం ఏ పార్టీకి వస్తుందో ఇండియా టుడే స్పష్టం చేసింది. గత కొంతకాలంగా తమ బృందం సాగిస్తున్న సర్వేను ఇండియా టుడే ప్రకటించింది. ఇండియా టుడే చెప్పిన దాని ప్రకారం ఏపీలో అధికార వైసిపి ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. గతంలో ఎన్నికలలో 22 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అయితే ఈసారి 14 స్థానాలు కోల్పోయి 8 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. ఇక కూటమి 17 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని తేలిపోయింది. గత ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేయగా మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి 14 స్థానాలు పెంచుకొని.. ఏకంగా 17 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైనది.
ఇక జాతీయ పార్టీ అయిన ఇండియా కూటమి ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం లేదని ఇండియా టుడే సర్వేలో తేలిపోయింది. కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో.. ఆమె కూడా గెలిచేది అనుమానమేనని ఇండియా టుడే సర్వేలో తేలింది. బిజెపి కూడా టిడిపి కూటమిలో భాగమే కాబట్టి దానికి ఎన్ని స్థానాలు వస్తాయనేది ఇండియా టుడే ప్రస్తావించలేదు.
ఇక అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి.. ఏపీలో 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసిపి 151 స్థానాలు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈసారి వైసీపీకి ఆ స్థాయిలో స్థానాలు రావని ఇండియా టుడే సర్వేలో తేలింది. కూటమి 110 నుంచి 115 వరకు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని.. మిగతా స్థానాల్లో వైసీపీ గెలిచి బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. అయితే ఈ సర్వేకు ఎంతమంది వద్ద శాంపిల్స్ సేకరించారు? ఏ ప్రాతిపదికన ప్రజలను ప్రశ్నలు అడిగారు? ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించారు? అనే విషయాలలో ఇండియా టుడే స్పష్టత ఇవ్వలేదు.
ఇక ఇండియా టుడే సర్వే నేపథ్యంలో వైసిపి నాయకులు స్పందించారు. ఇండియా టుడే సర్వే టిడిపికి అనుకూలంగా ఉందని.. దానిని మేము నమ్మబోమని వారు స్పష్టం చేశారు. గతంలో చాలా సర్వేలు వైసిపికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయని.. కేవలం ఇండియా టుడే మాత్రమే చంద్రబాబు మెప్పుకోసం సర్వే ఫలితాన్ని వెల్లడించిందని వారు అంటున్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏమిటో మరికొద్ది రోజుల్లో తేలిపోతుందని వారు వివరిస్తున్నారు. మరోవైపు ఇండియా టుడే సర్వే ఫలితాన్ని కూటమి నాయకులు స్వాగతిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి ఈ సర్వే ఫలితం చెంపపెట్టని అంటున్నారు. త్వరలో జగన్ పీడ నుంచి ఏపీ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The power in ap belongs to that party india today survey concluded
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com