Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: ఆ నేతకు ఇంటి పోరు తప్పించిన జగన్

Duvvada Srinivas: ఆ నేతకు ఇంటి పోరు తప్పించిన జగన్

Duvvada Srinivas: టెక్కలి నియోజకవర్గ విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడును ఓడించాలని జగన్ గట్టిగానే డిసైడ్ అయ్యారు. అక్కడ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాసరావు పేరును ఖరారు చేశారు. అయితే ఆయనకు సొంత కుటుంబం నుంచి నిరసన సెగలు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వంపై ఆయన భార్య వాణి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో దంపతులిద్దరి మధ్య వివాదంతో అక్కడ వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో అచ్చన్నను ఓడించడం తరువాయి.. ముందు వైసీపీ ప్రమాదంలో పడింది. దీంతో జగన్ సీరియస్ యాక్షన్ కు దిగారు. దువ్వాడ దంపతులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించారు.

గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం అచ్చన్న గెలుపొందారు. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పట్టు బిగించారు. అయితే అదే సమయంలో దువ్వాడకు జగన్ బాధ్యతలు అప్పగించారు. దూకుడుగా వ్యవహరించిన దువ్వాడ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి కృషి చేశారు. చివరకు కింజరాపు సొంత గ్రామం నిమ్మాడలో సైతం వారిని భయపెట్టాలని చూశారు. అది నచ్చిన జగన్ దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఒకానొక దశలో మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో జగన్ఆలోచనను విరమించుకున్నారు.అయితే దువ్వాడ దంపతుల మధ్య విభేదాలు రావడంతో అనూహ్యంగా నియోజకవర్గ ఇన్చార్జిగా దువ్వాడ వాణి పేరును జగన్ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అంతా వాణికే టికెట్ ఇస్తారని భావించారు. కానీ జగన్ యూ టర్న్ తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కే టిక్కెట్ కేటాయించారు.

అయితే జగన్ నిర్ణయాన్ని వాణి వ్యతిరేకించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న జగన్ దంపతులిద్దరిని తన వద్దకు రప్పించుకున్నారు. ముందుగా వాణితో సమావేశమయ్యారు.. తాను ఇంచార్జిగా ఉండగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ఎందుకు ఖరారు చేశారని ఆమె జగన్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో సీఎంకు ఎదురు చెప్పినట్లు సమాచారం. టెక్కలిలో ఒక లక్ష్యం మేరకు ముందుకు సాగుతున్నామని.. పంతాలకు పట్టింపులకు పోతే మూల్యం తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ వాణి వినలేదు. దాదాపు అరగంట సమయం ఇచ్చిన తర్వాత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గెలుపునకు కృషి చేయాలని.. ఆయన గెలిచిన తర్వాత.. ఎమ్మెల్సీ పదవి వాణికి ఇస్తామని జగన్ హామీ ఇవ్వడంతో ఆమె మెత్తబడ్డారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించారు. మొత్తానికైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఇంటి పోరు తప్పించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version