Pawan Kalyan: అది నామినేషన్ ర్యాలీ నా.. విజయోత్సవ వేడుకా.. అన్న రీతిలో పిఠాపురంలో జనసంద్రం నెలకొంది. జనసేన అభిమానుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ నామినేషన్ ప్రక్రియ ఉత్సాహ భరిత వాతావరణంలో సాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం, వాహనాలతో నిండిపోయి కన్నుల పండుగ సాగింది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ అన్నీ తానై వ్యవహరించారు. నామినేషన్ పర్వంలో జనసేనాని పక్కనే ఉండి నామినేషన్ వేయించడం విశేషం.హైదరాబాదు నుంచి వచ్చిన సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎన్నికల అఫీడవిట్లో పవన్ తన ఆస్తుల వివరాలను, అప్పుల వివరాలను పొందుపరిచారు. గత ఐదేళ్లలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను పొందుపరిచారు. గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300గా చూపించారు. ఆదాయపన్నుగా రూ.47.7 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.28.64 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. అప్పులు రూ.64.26 కోట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు, వ్యక్తుల నుంచి రూ.46.70 కోట్లు తీసుకున్నట్లు వివరించారు. వివిధ సంస్థలకు, జనసేన చేపట్టిన సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు రూ.20 కోట్లు విరాళాలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో జనసేనకు అందించిన విరాళాలు 17 కోట్ల రూపాయల వరకు ఉండడం విశేషం.
అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నట్లు పవన్ అఫిడవిట్లో పొందుపరిచారు. ఆ జాబితాలో పవన్ వదిన, చిరంజీవి సతీమణి సురేఖ ఉండడం విశేషం. ఆమె నుంచి పవన్ రెండు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వదినతో పవన్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. ఆమెను తల్లి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. అటువంటి ఆమె పవన్ కు రెండు కోట్ల రూపాయల అప్పు ఇవ్వడం విశేషం. ఇటీవలే చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనే కాదు మెగా కాంపౌండ్ వాల్ హీరోలు తలో మొత్తం అందించారు. కాగా తన వదిన సురేఖతో పాటు సన్నిహితులు 14 మంది నుంచి అప్పు తీసుకున్నట్లు కూడా పవన్ పేర్కొన్నారు.