Traffic Rules : ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠిన చర్యలకు దిశగా దిగాలని ఏపీ పోలీస్ శాఖకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సంకేతం ప్రజలకు పంపించాలని ఆదేశించింది. ఇంతకుముందే హైకోర్టు హెల్మెట్ ధరించడం పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇది ఎక్కడ అమలవుతున్న దాఖలాలు లేవు. మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి,భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగి హైకోర్టులో పీల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ట్రాఫిక్ ఐజిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఐజి అకే రవి కృష్ణ హైకోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల బాధ్యతను గుర్తు చేసింది.
* రెండు నెలలపాటు కఠినంగా వ్యవహరిస్తే..
రహదారులపై తనిఖీ విషయంలో రెండు నెలల పాటు కఠినంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. అప్పుడే మార్పు అనేది సాధ్యమని వ్యాఖ్యానించింది. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సదస్సులు నిర్వహించాలని కూడా సూచించింది. పత్రికలు, టీవీలు, ఎఫ్ఎం రేడియోలు, ప్రకటన బోర్డులు, సినిమా హాళ్లలో ప్రకటనలు ఇవ్వాలని కూడా ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్ ధారణ తప్పనిసరి పై తీసుకున్న చర్యలు, జిల్లాల వారీగా ఏర్పాటైన బృందాల వివరాలు, ప్రభుత్వ ప్రతిపాదనలను అఫీడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని కూడా ఆదేశించింది.
* వాహన జప్తునకు ఆదేశం
వాస్తవానికి పోలీసులు సీసీ కెమెరాలు పై ఆధారపడి చలానాలు వసూలు చేస్తున్నారు. ఆ విధానాన్ని తగ్గించి నేరుగా అపరాధ రుసుము వేసే విధానాన్ని ప్రోత్సహించాలని. చలానా రూపంలో జరిమానా వేసిన మొత్తాన్ని 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయవచ్చన్న నిబంధనను పక్కాగా అమలు చేయాలని కూడా ఆదేశించింది. 99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని.. కేవలం బైక్ నడిపే వ్యక్తి కాకుండా.. వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.ముఖ్యంగా ఢిల్లీ, చండీఘడ్ తరహాలో తనిఖీలు పెంచాలని ఆదేశించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. మొత్తానికైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం అసాధ్యం. చలానాల విషయంలో కూడా గతం మాదిరిగా ఉదాసీనంగా ఉంటే బండి సీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఏపీ హైకోర్టు తాజా ఆదేశాలు అందరికీ కనువిప్పే.