Anganwadi Employees: అంతమంది తొలగింపు.. ఎన్నికల వేళ మరో పెను దుమారాన్ని రాజేసిన జగన్

విజయవాడను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో నగరవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. సీఎం ఇంటి చుట్టుపక్కల మూడు అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Written By: Neelambaram, Updated On : January 22, 2024 6:11 pm

Anganwadi Employees

Follow us on

Anganwadi Employees: ఏపీలో అంగన్వాడీల ఉద్యమం పతాక స్థాయికి చేరింది. 40 రోజులకు పైగా సమ్మె చేస్తున్నా జగన్ సర్కార్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో అంగన్వాడీలు మండిపడుతున్నారు. మరోవైపు విధులకు హాజరుకాని అంగన్వాడీ ఉద్యోగులను తొలగించి కొత్తవారిని నియమించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. సమస్యలు పరిష్కరించకపోగా ఉద్యోగాలను తొలగిస్తామన్న హెచ్చరికను గట్టిగా తిప్పి కొట్టాలని అంగన్వాడీలు భావిస్తున్నారు. ఈరోజు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అంగన్వాడీలు విజయవాడ రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విజయవాడను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో నగరవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. సీఎం ఇంటి చుట్టుపక్కల మూడు అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వద్ద సర్వీస్ రోడ్లో ప్రతి ఒక్కరిని పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు వైపు నుంచి సీఎం నివాసం వైపు వస్తున్న అంగన్వాడీలను, కార్మిక సంఘాల నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి వరకు ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో 2000 మంది అంగన్వాడీలను మూకుమ్మడిగా అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతలను కూడా విడిచిపెట్టలేదు. నిద్రిస్తున్న వారిపై పోలీస్ జూలం ప్రదర్శించారు. మీడియా లేని సమయంలో ఈ చర్యలకు దిగారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమ్మె నోటీసు గడువు పూర్తవుతున్న తరుణంలో.. విధులకు హాజరుకాని అంగన్వాడీ ఉద్యోగులను తొలగించాలని.. వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై అంగన్వాడీ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అందరూ పండుగను హాయిగా గడుపుకోగా.. తాము రహదారుల పైకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామని అంగన్వాడీలు హెచ్చరించడం విశేషం.