Ram Mandir: యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఆధ్యాత్మిక నగరి అయోధ్యవైపే ఉంది. ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. ఐదు దశాబ్దాల కల సాకారం అవుతోంది. అయోధ్య రా మందిరం ప్రారంభోత్సవంలో ప్రధాన కర్తగా ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. అయితే, మూడేళ్ల క్రితం సుప్రీం తీర్పు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రధాని పేరే అయోధ్య రామాలయం సందర్భంగా వినిపిస్తోంది. ఇక నరేంద్ర మోదీ వ్యూహాలు రచిస్తూ ఉండగా, వాటిని పక్కాగా అమలు చేస్తూ యూపీ సీఎం యోగి సక్సెస్ అయ్యారు. రామాలయం భూమి పూజ జరిగిన 2021 ఆగస్టు 5 నుంచి బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే 2024, జనవరి 22 వరకు యోగీదే కీలక పాత్ర.
బీజేపీని అధికారంలోకి తెచ్చిన అయోధ్య..
అయోధ్య రామజన్మ భూమి అంశం బీజేపీ రాజకీయ ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషించింది. ఇక దశాబ్దాల కల అయిన రామ మందిరం నిర్మాణంలో అనేక కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తొలిగా గెలిచింది 2 స్థానాలు. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లను గెలుచుకుంది. ఇక 1989 ఎన్నికల సమయంలో బీజేపీ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల అజెండీలో చేసింది. ఈమేరకు పాలంపూర్‌లో ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 85 స్థానాల్లో విజయం సాధించింది. ఇక 1990లో అద్వానీ సోమ్‌నాథ్ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర బీజేపీని దేశవ్యాప్తం చేయడంలో కీలక మలుపుగా చెప్పుకోవాలి. ఈ యాత్ర తర్వాత 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 121 స్థానాల్లో విజయం సాధించింది.
బాబ్రీ మసీదు విధ్వంసం..
1992లో కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. తర్వాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బాబ్రీ మసీదు ధ్వంసం కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 161 స్థానాలు గెలిచిన బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ, రెండు వారాల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. 1998ల తిరిగి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రభుత్వం ఎక్కవ కాలం కొనసాగలేదు. 1999–2004 వరకు వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగింది. అయితే హంగ్ ప్రభుత్వం కావడంతో అయోధ్య, కామన్ సివిల్ కోడ్ అంశాలను వాజ్‌పేయి పక్కన పెట్టారు. దీంతో 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చింది.
మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి..
ఇక 2014లో బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బీజేపీ తిరిగి హిందుత్వ ఎజెండా ఎత్తుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 282 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మోదీ ప్రధాని అయ్యారు. ఇక 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను 303కు పెంచుకుంది. ఇక ఈ ఏడాది (2024లో) జరిగే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని మోదీ భావిస్తున్నారు. అందుకే ఆయన కాశ్మీర్, అయోధ్య అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మోదీ శ్రీకారం చుట్టారు.
బీజేపీ మిషన్ అయోధ్య..
2024 ఎన్నికల్లో 400 సీట్లతో హ్యాట్రిక్ విజయం సాధించాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆయన రామ మందిరం అంశాన్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామాలయోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెరపై మోదీ కనిపిస్తున్నా.. తెర వెనుక మాత్రం యోగీ ఉన్నారు. ఆలయానికి భూమిపూజ నుంచి నేటి ప్రారంభోత్సవం వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై నడిపించారు యోగి. గతంలో ఏ ఆలయం ప్రారంభోత్సవానికి దక్కని ప్రచారం.. ఈ స్థాయి ఆధ్మాత్మిక శోభకు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ప్రభుత్వానిదే. వివాదాలకు దూరంగా ఉంటూ… మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవటంలో యోగీ కీలక పాత్ర పోషించారు.