Anantagiri: మృతదేహంతో 8 కి.మీ. నడక.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ చినకోనల గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం ఉపాధిని వెతుక్కుంటూ గుంటూరు జిల్లాకు వెళ్లింది. అక్కడ ఓ ఇటుకుల బట్టిలో వారు పనికి కుదిరారు.

Written By: Dharma, Updated On : April 10, 2024 12:10 pm

Anantagiri

Follow us on

Anantagiri: ఏపీ స్వరూపాన్ని మార్చేశామని పాలకులు చెబుతున్నారు. అభివృద్ధిలో మేమంటే మేమని పార్టీలు ఆర్భాటపు ప్రకటనలు ఇస్తూనే ఉన్నాయి. కానీ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు దక్కని వర్గాలు చాలా ఉన్నాయి. ఇంకా రవాణా సౌకర్యం నోచుకోని వందలాది గిరిజన గ్రామాలు సైతం ఉన్నాయి. చివరకు అనారోగ్య, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లు రాలేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే చావు అంచులకు వెళ్లాల్సిందే. డోలీలు కట్టుకొని వైద్యం చేయించడానికి బయలుదేరితే మార్గమధ్యలో మృత్యువాత పడాల్సిందే. ప్రతిరోజు ఏదో ఒక పత్రికలో, సోషల్ మీడియాలో ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. అటువంటి హృదయ విదారక ఘటన తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ చినకోనల గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం ఉపాధిని వెతుక్కుంటూ గుంటూరు జిల్లాకు వెళ్లింది. అక్కడ ఓ ఇటుకుల బట్టిలో వారు పనికి కుదిరారు. ఆ కుటుంబంలో మూడేళ్ల వయసు ఉన్న బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహంతో అంబులెన్స్లో ఆ కుటుంబం స్వగ్రామానికి బయలుదేరింది. విజయనగరం జిల్లా వనిజ వరకు అంబులెన్స్ వచ్చింది. కానీ అక్కడ నుంచి సరైన రహదారి లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొని.. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో స్వగ్రామానికి అతి కష్టం మీద చేరుకున్నారు. ప్రస్తుతం ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల తీరుపై మండిపడుతున్నారు.

బాలుడి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని వెళ్తుండడం చూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆ విషాదాన్ని దిగమింగుకొని కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని అతి కష్టం మీద గ్రామానికి చేర్చారు. అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏపీలో గిరిజన అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని చెబుతున్న ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం సమాధానం చెబుతాయని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో ఈ ఫోటో కనిపిస్తుండడంతో నేతలు సైతం స్పందిస్తుండడం విశేషం. అయితే ఆ బాలుడి మృతిని కూడా రాజకీయం చేయడం ప్రారంభించారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ అసలు సమస్యకు మూలం ఏమిటన్నది గుర్తించడం లేదు. దాని గురించి చర్చ కూడా లేదు.