https://oktelugu.com/

Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి ఈ స్థాయి వెనక అతడి తండ్రి.. త్యాగం తెలిస్తే కన్నీళ్ళాగవు..

బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై అద్భుతంగా ఆడిన నితీష్ రెడ్డి.. అసలు సిసలైన పోరాడే లక్ష్యాన్ని ప్రదర్శించాడు. తనకంటే గొప్ప గొప్ప బ్యాటర్లు వెంట వెంటనే వెను తిరుగుతుంటే.. అతడు మాత్రం అద్భుతంగా ఆడాడు.

Written By: , Updated On : April 10, 2024 / 12:05 PM IST
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

Follow us on

Nitish Kumar Reddy: చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. హైదరాబాద్ తరఫున తను ఏంటో నిరూపించుకునే అవకాశం అతడికి దక్కలేదు. కానీ మంగళవారం ఉగాది రోజున అతడి దశ తిరిగిపోయింది. పంజాబ్ మైదానంలో తెలుగువాడి సత్తా చూపించాడు. తిరుగులేని ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు.. హైదరాబాద్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 64 రన్స్ చేసి అదరగొట్టాడు.. బంతి తోనూ మెరిసి ఒక వికెట్ దక్కించుకున్నాడు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. హైదరాబాద్ జట్టులో కీలక ఇన్నింగ్స్ ఆడి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. దీంతో అటు మీడియా, ఇటు సోషల్ మీడియా నితీష్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. మీమ్స్ కయితే లెక్కేలేదు.

అద్భుతంగా ఆడాడు

బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై అద్భుతంగా ఆడిన నితీష్ రెడ్డి.. అసలు సిసలైన పోరాడే లక్ష్యాన్ని ప్రదర్శించాడు. తనకంటే గొప్ప గొప్ప బ్యాటర్లు వెంట వెంటనే వెను తిరుగుతుంటే.. అతడు మాత్రం అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా పంజాబ్ పేస్ బౌలర్ కవిసో రబాడా బౌలింగ్ లో నితీష్ రెడ్డి కొట్టిన భారీ సిక్సర్ ఈ మ్యాచ్ కే అద్భుతంగా నిలిచింది.

ఉద్యోగాన్ని వదులుకున్నాడు

తను ఆడిన రెండవ మ్యాచ్ లోనే అనితర సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లు అతడి ఆట చూసి.. భావిభారత క్రికెటర్ అవుతాడని జోస్యం చెబుతున్నారు. అతడి ఆట తీరును కొనియాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నితీష్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. మరీ ముఖ్యంగా అతడి తండ్రి చాలా త్యాగాలు చేశాడు. నితీష్ రెడ్డి కెరియర్ కోసం అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఉద్యోగం మానేశాడు. నితీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లో జన్మించాడు. అతడిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. నితీష్ రెడ్డికి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. హిందుస్థాన్ జింక్ కంపెనీ మైదానంలో క్రికెట్ ఆడుతుంటే ఇష్టంగా చూసేవాడు. అలా ప్లాస్టిక్ బంతులతో తన ఆటను మొదలుపెట్టాడు. కొడుకు ఇష్టాన్ని చూసి ప్రోత్సహించడంతో క్రికెట్ వైపు అడుగులు వేశాడు. దాన్ని కెరియర్ గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డి ని ఉదయపూర్ బదిలీ చేయడంతో.. తన కొడుకు కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ నిర్ణయం పట్ల ముత్యాల రెడ్డి ని అతడి బంధువులు తిట్టినప్పటికీ పట్టించుకోలేదు. మరోవైపు ఇక్కడి రాజకీయాలకు భయపడి తన తండ్రి తనను వదలకుండా అట్టిపెట్టుకున్నాడని నితీష్ రెడ్డి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కెరియర్ ప్రారంభంలో విశాఖలో ఏర్పాటు చేసిన శిబిరాలకు నితీష్ కుమార్ రెడ్డి హాజరయ్యేవాడు. ఇక మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కే ప్రసాద్ తోడ్పాటుతో నితీష్ రెడ్డి కడపలోని ఏసీఏ అకాడమీలో చేరాడు. అక్కడ తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకున్నాడు.

ఏజ్ గ్రూప్ క్రికెట్ లో..

ఇక ఏజ్ గ్రూప్ క్రికెట్లో నితీష్ కుమార్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మీడియం పేసర్ గా తనను తాను మలచుకున్నాడు. అంతేకాదు అండర్ 19 ఇండియా బీ టీంకు సారధ్యం వహించాడు. 2019-20 రంజి సీజన్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి మొత్తంగా 366 రన్స్ చేశాడు.

20 లక్షలకు కొనుగోలు చేసింది

గత ఏడాది నితీష్ రెడ్డిని హైదరాబాద్ జట్టు యాజమాన్యం 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆ డబ్బుతో నితీష్ రెడ్డి కారు కొనుగోలు చేశాడు. గత సీజన్ చివర్లో అతడికి ఆడే అవకాశం లభించింది. ఇక ఈ సీజన్లో నిర్వహించిన సన్నాహక మ్యాచ్ లలో అతడు సత్తా చాటాడు. చెన్నై జట్టుతో తొలి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్ లో గెలుపు షాట్ తో మ్యాచ్ ముగించాడు. పంజాబ్ తరఫున జరిగిన మ్యాచ్లో బీభత్సమైన బ్యాటింగ్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. నితీష్ రెడ్డి ఈ స్థాయిలో ఆడటం వెనుక అతడి తండ్రి త్యాగాన్ని తెలుసుకొని పలువురు నెటిజెన్లు.. “గొప్ప తండ్రి అంటూ” కితాబిస్తున్నారు.

ఆల్ రౌండర్ గా రాణించాలని ఉంది

మరోవైపు నితీష్ రెడ్డి ఈ సీజన్ ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.. గత ఏడాది నన్ను బౌలర్ గానే చూశారని, కానీ ఈ ఏడాది ఆల్ రౌండర్ గా రాణించాలని ఉందని వ్యాఖ్యానించాడు. అతని వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మంగళవారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అటు బౌలర్ గా ఒక వికెట్ తీశాడు. ఇటు బ్యాటర్ గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.. అప్పట్లో నితీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.