https://oktelugu.com/

AP DGP: ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో ఉండండి.. 16మంది సీనియర్ ఐపీఎస్ లకు డీజీపీ మెమో

ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత భారీగా ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇక తమకు అనుకూలంగా ఉండేవారికి కీలక బాధ్యతలు అప్పగించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 14, 2024 / 05:51 PM IST

    AP DGP

    Follow us on

    AP DGP: ఏపీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కార్‌ కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన గడిచిన ఐదేళ్లు తనను ఇబ్బంది పెట్టిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ను బదిలీ చేశారు. కొంత మందిని అప్రధాన్య పోస్టులు ఇవ్వగా, కొందరిని వెయిలింగ్‌ లిస్టులో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌కు సన్నిహితులు, అనుకూలులుగా ఉన్నారన్న కారణంతోనే చాలా మందిని పక్కన పెట్టారు. దీంతో 16 మంది ఐపీఎస్‌లు పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది ప్రభుత్వం ప్రసన్నం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో కీలక నేతలతో పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వీరికి డీజీపీ మొమోలు జారీచేసి షాక్‌ ఇచ్చారు. వెయిటింగ్‌ లిస్టులో ఉండి హెడ్‌ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండడం లేదన్న కారణంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సాయంత్రం డ్యూటీ ముగిశాక అటెండెన్స్‌ రిజిస్ట్రీలో సంతకాలు చేయాలని స్పష్టం చేశారు.

    వీరికి మెమోలు..
    మెమో జారీ అయినవారిలో ఐపీఎస్‌ అధికారులు పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌కుమార్, సంజయ్, కాంతిరాణా టాటా, విజయరావు, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విశాల్‌గున్ని, రిషాంత్‌ రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, కృష్ణకాంత్‌ పటేల్, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. మరోవైపు అనంతపురం జేసీగా డి.హరితకు ఇచ్చిన పోస్టింగును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరితను ఆదేశించింది.
    రవి కృష్ణకు పోస్టింగ్‌..
    ఇదిలా ఉంటే.. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆకే రవికృష్ణకు ఏపీ సర్కార్‌ పోస్టింగ్‌ ఇచ్చింది. పోలీస్‌ ఆర్గనైజేషన్‌ ఐజీగా ఆకే రవికృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌కు బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశాలిచ్చింది. మరోవైపు గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు వీలుగా ఏపీలో యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోంది. దీని బాధ్యతలను రవి కృష్ణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.