Thandriki Vandanam: అధికారులకు ఒక చిక్కు వచ్చి పడింది. కూటమి ప్రభుత్వం( government) ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం వర్తింపజేశారు. పాఠశాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చు పోనూ.. ఒక్కో విద్యార్థికి 13 వేల రూపాయల చొప్పున అందించారు. అయితే ఈ మొత్తాన్ని తల్లుల ఖాతాలో వేశారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఇద్దరు పిల్లలు.. తల్లికి వందనం సాయంపై వింత అభ్యర్థన చేశారు. ఆ డబ్బులు తల్లికి కాకుండా తండ్రికి అందించాలని కోరారు. వారి తల్లిదండ్రులు విడిపోవడమే అందుకు కారణం. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని.. ఆ డబ్బులు ఆయనకే ఇవ్వాలని వారు వేడుకున్నారు. అయితే ఈ వింత పరిస్థితిని ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు సతమతమయ్యారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు.
ఎంపీడీవో కు వినతి పత్రం..
తూర్పుగోదావరి జిల్లా( East Godavari district) సీతానగరం బొబ్బిర్లంకకు చెందిన చిత్రపు సంధ్యన, సునయనలు అక్కా చెల్లెళ్లు. వారిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్ కు వెళ్లారు. తమకు ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులు 26 వేల రూపాయలను తమ తండ్రికి ఇవ్వాలని వినతి పత్రం అందించారు. అయితే దీనిపై షాక్ కు గురయ్యారు ఎంపీడీవో. అసలు విషయం తెలుసుకొని ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
Also Read: Tesla Mumbai Showroom: ఎట్టకేలకు ఇండియాలో టెస్లా.. ముంబైలో షోరూం స్పెషాలిటీ ఇదే
తండ్రి సంరక్షణలో..
ఆ చిన్నారుల తల్లిదండ్రులు వివిధ కారణాలతో విడిపోయారు. అప్పటినుంచి ఇద్దరు ఆడపిల్లలు తండ్రి సంరక్షణలో ఉన్నారు. తండ్రి అబ్బులకు కాలు పని చేయడం లేదు. అయినా సరే ఉపాధి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే ఆ బాలికల పేరిట వస్తున్న తల్లికి వందనం నిధులు తల్లి ఖాతాలో పడుతున్నాయి. దీంతో అవి వీరికి అందకుండా పోతున్నాయి. ఆ నగదు ఇప్పిస్తే తమకు, తమ కుటుంబానికి ఎంతో ఉపయోగమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు కూడా పూర్తిగా పాడైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ తల్లి అకౌంట్ నెంబర్ ను నిలిపివేయాలని.. ఆ నగదు మా తండ్రికి ఇచ్చి ఆదుకోవాలని ఆ ఇద్దరు బాలికలు కోరడం అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీడీవో హామీ ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరు బాలికలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.