Thalliki Vandanam Scheme: ఏపీలో( Andhra Pradesh) తల్లికి వందనం పథకం అమలు చేసింది ప్రభుత్వం. ఈనెల 12 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అయితే వివిధ సాంకేతిక కారణాలతో అర్హత ఉన్నవారు సైతం డబ్బులు పొందలేకపోయారు. ముఖ్యంగా 300 యూనిట్ల కరెంటు వినియోగం పై అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి. ఎక్కువగా కరెంట్ వినియోగం తోనే ఎక్కువమంది అనర్హుల జాబితాలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈనెల 20 వరకు లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించింది. అయితే ఈ అర్జీలను ఈ నెల 28 వరకు పరిశీలిస్తారు. ఈనెల 30 నాటికి అర్హుల జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. మరోవైపు తల్లికి వందనం పథకానికి అర్హులై ఉండి కూడా.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాని వారిని అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లలో అకౌంట్లు ఓపెన్ చేయాలని.. దానికి ఆధార్ తో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: జగన్ ఐదు వారాల వ్రతాలు చేస్తున్నాడా? ఏబీఎన్ వెంకటకృష్ణ సూపర్ సిక్స్ అమలు పై ఇలానే మాట్లాడగలడా?
* సచివాలయాల్లో ఆధార్ సీడింగ్
ఆధార్ సీడింగ్( Aadhar seeding) ప్రక్రియ ప్రస్తుతం సచివాలయాల్లో జరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ బుక్ లు తీసుకొని సచివాలయంలో విద్యా కార్యదర్శి లేదా అడ్మిన్ ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానం ఉన్నవారు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. మరోవైపు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతిలో ప్రవేశించే విద్యార్థులతో పాటు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సైతం జూలై 5న డబ్బులు జమ చేయడానికి డిసైడ్ అయింది. ఇప్పటికే జూన్ 12న మిగతా విద్యార్థులకు నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ప్రవేశాలు ఆలస్యం కావడంతో ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నగదు జమ చేస్తారు.
* గ్రీవెన్స్ కు సాంకేతిక సమస్యలు..
తల్లికి వందనం( Thallikki Vandanam ) పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీవెన్స్ ఆప్షన్ ఇచ్చింది. అయితే ఎక్కడికి అక్కడే సచివాలయాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా సచివాలయాల్లో ఏపీ ఫైబర్ నెట్ పనిచేయడం లేదు. మరోవైపు తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ సర్వర్ సమస్య ఎదురవుతుంది. దీంతో సచివాలయ ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడాల్సి వస్తోంది. మరోవైపు తల్లికి వందనం అనర్హుల జాబితాలో ఉన్న వారు సచివాలయ ఉద్యోగులను నిలదీస్తున్నారు. అయితే దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో సచివాలయాల్లో వివాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నెల 26 వరకు గ్రీవెన్స్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈనెల 28 వరకు పొడిగించింది. వివిధ కారణాలతో తల్లికి వందనం పథకానికి దూరమైన వారికి నగదు జమ చేసేందుకు నిర్ణయించింది.