TDP : తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో విజయవాడ నేతలు సైలెంట్ అయ్యారు. పెద్దగా చప్పుడు చేయడం లేదు. దీంతో వీరంతా అసంతృప్తి బాట పట్టారన్న ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే తమకు పదవులు ఖాయమని వీరు అంచనాలు వేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అధినేత చంద్రబాబుతో పాటు చిన్న బాస్ లోకేష్ కూడా వీరికి హామీలు ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఇప్పటివరకు రెండుసార్లు నామినేటెడ్ పోస్టుల జాబితా వచ్చింది. ఒక ఎనిమిది వరకు ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగింది. మరోవైపు ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఎంపికయ్యారు. కానీ విజయవాడ టీంకు మాత్రం ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో వారు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read : గజపతి నగరంలో అంబరాన్నంటిన సంబరాలు.. అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
* హైదరాబాద్ కు పరిమితమైన ఉమా..
ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమ( devineni uma ) పార్టీకి దూరంగా ఉన్నారు. సమకాలిన అంశాలతో పాటు టిడిపి విధానాలపై గట్టిగా మాట్లాడేవారు దేవినేని ఉమ. గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చేవారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. టిడిపి విధానాలపై మాట్లాడేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ప్రస్తావించేవారు. అయితే గత కొంతకాలంగా ఆయన కనిపించడం లేదు. కనీసం ఏపీ వైపు రావడం లేదు. టిడిపి కార్యాలయానికి రావడం మానేశారు. చంద్రబాబు వెంట కూడా కనిపించడం లేదు. మొన్న ఆ మధ్యన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్లినప్పుడు కూడా ముఖం చాటేసారు. సో దేవినేని ఉమ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు చెప్పారని మైలవరం టికెట్ వదులుకుంటే.. తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం.
* యాక్టివిటీస్ తగ్గించిన బుద్ధ వెంకన్న..
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ( Buddha venkana )సైతం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. వెంకన్న. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు పదవి ఖాయమని అంచనా వేసుకున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల్లో ఈయన పేరు కనిపించలేదు. ఎమ్మెల్సీ పదవులు విషయంలో మాత్రం ఆశావహుల జాబితాలో వెంకన్న పేరు ఉండేది. కానీ చివరి నిమిషంలో కనిపించకుండా పోయేది. విజయవాడ వెస్ట్ సీటును ఆశించారు. అది దక్కక పోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు పదవి ఖాయమని కూడా అంచనా వేశారు. కానీ ఇంతవరకు వెంకన్నకు పదవి దక్కలేదు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో మునుపటి మాదిరిగా కనిపించకుండా మానేశారు వెంకన్న.
* సొంత పార్టీ దిశగా రాధాకృష్ణ..
మరోవైపు వంగవీటి రాధాకృష్ణ ( vangaveeti Radha Krishna )సైతం ఫుల్ సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు రాధాకృష్ణ. గత ఐదేళ్లలో ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఎదురైనా తిరిగి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. పైగా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఒకటి రెండుసార్లు చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం రాధాకృష్ణను పరామర్శించారు. తప్పకుండా పదవి ఇస్తామని చెప్పుకొచ్చారు. మొన్నటి ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి రాధాకృష్ణకు ఖాయమని ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో ఆయనకు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సొంతంగా పార్టీ పెడతారని కూడా టాక్ నడుస్తోంది. మొత్తానికైతే విజయవాడలో ఆ ముగ్గురు నేతల సైలెంట్ టిడిపిలో చర్చకు కారణమవుతోంది. మరి వారి విషయంలో టిడిపి హై కమాండ్ ఆలోచన ఎలా ఉందో తెలియాలి.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. టిడిపిలో కనిపించని అసంతృప్త స్వరాలు.. తప్పిన వైసిపి అంచనా!*