Nara Lokesh: ఏపీలో తెలుగుదేశం పార్టీ దూకుడు మీద ఉంది. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టింది కొత్త ప్రభుత్వం. ఇంకోవైపు కూటమిలోని మూడు పార్టీలు సొంతంగా ఎదిగేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా టిడిపి రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపడుతోంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త రికార్డు సృష్టించింది. జట్ స్పీడ్ తో ముందుకు సాగుతూ చరిత్రను తిరగరాస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని విధంగా టిడిపి సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. అతి తక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తి చేసింది టిడిపి. పార్టీ ఆవిర్భవించిన 43 ఏళ్లలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు చేయడం మామూలు విషయం కాదు.
* 29 రోజుల వ్యవధిలోనే
అక్టోబర్ 26న టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. కేవలం 29 రోజుల వ్యవధిలో 50 లక్షల మార్కును దాటిపోయింది. గెలుపోటములు, సంక్షోభాలతో సంబంధం లేకుండా ఏపీలో 40 మూడేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకుంటూ వస్తోంది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయస్థాయిలో గట్టిగానే వాయిస్ వినిపించింది టిడిపి. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీని నడిపించడంలో ముందున్నారు చంద్రబాబు. ఇప్పుడు అదే పంధాను కొనసాగిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఆన్లైన్లో టిడిపి సభ్యత్వ నమోదుకు ప్రోత్సహించారు. అందుకు తగ్గట్టు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
* సాంకేతిక పరిజ్ఞానంతో
సరికొత్త రిఫరల్ సిస్టంతో టిడిపి సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. అయితే అదే సమయంలో మంత్రి లోకేష్ సైతం యాక్టివ్ గా పని చేస్తున్నారు. సభ్యత్వ నమోదులో బాగా కృషి చేస్తున్న వారిని నేరుగా అభినందిస్తున్నారు. ఫోన్లోనే పార్టీస్ నేతలకు అభినందనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు నాయకులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద బీమా అమల్లోకి తేవడంతో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. రాజంపేట నియోజకవర్గంలో 93,299 సభ్యత్వాలు జరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో కుప్పం ఉంది. అటు తరువాత కళ్యాణదుర్గం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు నిలిచాయి. అయితే ఎప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్ సమీక్షలు జరుపుతున్నారు. అదే ఇప్పుడు సభ్యత్వ నమోదు పెరగడానికి ప్రత్యేక కారణం. మరోవైపు గత ఐదేళ్లలో చాలామంది టీడీపీ శ్రేణులను ఆదుకుంది హై కమాండ్. దాదాపు 135 కోట్ల రూపాయల వరకు సాయం అందించింది. వైసిపి హయాంలో పార్టీ శ్రేణులపై అక్రమ కేసుల పరిశీలనకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు మాత్రం మంత్రి నారా లోకేష్ చలువే. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.