TDP Party : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో కొందరు నేతలు దూకుడుగా వ్యవహరించారు. దుందుడుకు వైఖరితో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కొందరు మంత్రుల అనుచరులు తెగ రెచ్చిపోయారు. వారి వైఖరితో మంత్రులకు చాలా చెడ్డ పేరు వచ్చింది. అటువంటి ఘటనే ఒకటి 2023 అక్టోబర్లో పుంగనూరులో జరిగింది. మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నేతలు సైకిల్ యాత్రగా కుప్పం వెళ్తున్నారు. ఆ సమయంలో పుంగనూరు నియోజకవర్గం వైపు వెళ్తున్న వారిని అడ్డుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు. టిడిపి కార్యకర్తలపై అమానవీయంగా ప్రవర్తించారు. దీంతో తీవ్రభయాందోళనకు గురైన టిడిపి కార్యకర్తలు ఎలాగోలా అక్కడ నుంచి బయటపడ్డారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ తాజాగా అదే చోటు నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలు. అక్కడ నుంచి కడప జిల్లాలో జరిగే మహానాడుకు సైకిల్ యాత్రగా తరలి వెళ్తున్నారు.
Also Read : మహానాడుకు అన్నగారి ఆహ్వానం.. వీడియో వైరల్!
* చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ..
చంద్రబాబు( CM Chandrababu) 2023 సెప్టెంబర్లో అక్రమ కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు ఆయన 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆయనకు బెయిల్ దక్కకుండా కేసుల మీద కేసులు నమోదు చేశారు. చివరకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే నాడు టిడిపి తో పాటు జనసేన శ్రేణులు చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ 19న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు నిద్ర బంగి రామకృష్ణ, చిన్న రామ సూరి, ఆదినారాయణ, పెంటయ్య, సుందర్ రాములు సైకిల్ యాత్రగా కుప్పం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వీరి సైకిల్ యాత్ర ప్రారంభం అయింది. దారి పొడవున ఉన్న దేవాలయాలను సందర్శిస్తూ.. చంద్రబాబుకు బెయిల్ లభించాలని వారు పూజలు చేసేవారు.
* పుంగనూరులో అడ్డగింత..
అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీరి సైకిల్ యాత్ర ( cycle rally) సజావుగా సాగుతున్న క్రమంలో.. పుంగనూరులో మాత్రం తీవ్ర అవమానం ఎదురయింది. పుంగనూరు సమీపంలోని సుగాలి మిట్టలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు చంగలాపురం సూరి వారిపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. ఇది పెద్దిరెడ్డి ఇలాకా… ఎక్కడ వైసీపీ జెండా తప్ప మరొకటి కనిపించకూడదు అని హెచ్చరించాడు. పసుపు చొక్కాలు విప్పించి, సైకిళ్లకు ఉన్న పసుపు జెండాలను కిందపడేసి కాళ్లతో తొక్కి దుర్భాషలాడాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దాడి చేసినంత పని చేయడంతో వారికి ఏమీ పాలు పోలేదు. అక్కడ వైసీపీ కార్యకర్తల బెదిరింపులతో హడలెత్తిపోయారు. ఎలాగోలా అప్పట్లో అక్కడ బయటపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. కడపలో మహానాడు జరుగుతుండడంతో.. నాడు ఆగిన చోట నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టారు శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యకర్తలు. మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా వీరు నిలవనున్నారు.