TDP MP vs MLA : తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) అత్యంత బలమైన జిల్లాలో కృష్ణా ఒకటి. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. కూటమి ఇక్కడ ప్రభంజనం సృష్టించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఇంతటి ఘనవిజయం సొంతం చేసుకున్న జిల్లాలో ఇప్పుడు నేతల మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు పరిస్థితి మారింది. ఇది ఇలానే కొనసాగితే తెలుగుదేశం పార్టీకి నష్టమని క్యాడర్ ఆందోళన చెందుతోంది. సరిదిద్దే చర్యలు చేపట్టాలని టిడిపి హై కమాండ్ ను పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
Also Read : ఆ జిల్లాలో కట్టు దాటుతున్న పసుపు నేతలు!
* తిరువూరు ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapoodi Srinivasa Rao) తలనొప్పిగా మారారు. ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నారు. దీంతో పార్టీ ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ ను తిట్టడానికి కాదు మనల్ని ప్రజలు ఎన్నుకుంది, వారికి మంచి చేయడానికి అని ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మద్యం విధానంలో ఉన్న లోపాలను కూడా ఎత్తిచూపారు ఆయన. జగన్ హయాంలో మద్యం షాపుల వద్ద అమ్మకాలు జరిగేవని.. ఇప్పుడు అన్నిచోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కొలికపూడి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని.. అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని ప్రచారం సాగుతోంది. మొన్నటి సీఎం చంద్రబాబు పర్యటనలో సైతం ఆయనను పట్టించుకోకపోవడంతో.. ఇక టిడిపిలో కొలికపూడి శకం ముగిసినట్టే అన్న ప్రచారం జరుగుతోంది.
* కొలికపూడికి లేని ఆహ్వానం..
తాజాగా తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ సెల్ ( SC cell meeting) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసరావును పిలవలేదు. పైగా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. అయినా సరే ఉద్దేశపూర్వకంగానే పిలవలేదని తెలుస్తోంది. దీని వెనుక ఎంపీ చిన్ని హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో తన వెనుక కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు అనుమానిస్తున్నారు. అందుకు ఎంపీ చిన్ని కారణమని భావిస్తున్నారు. అందుకే బాహటంగానే ఎంపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొలికపూడి.
* తంగిరాల సౌమ్యకు అవమానం..
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య( nandigama MLA tangirala Sowmya) కూడా ఎంపీ కేసినేని చిన్నితో విభేదిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన సౌమ్య విజయం సాధించారు. ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటనలో సౌమ్యకు అవమానం జరిగింది. హెలిపాడ్ వద్ద సీఎం కు ఆహ్వానం పలికేందుకు వెళుతుండగా అధికారులు అడ్డుకున్నారు. తాము ఎంపీ చిన్ని ఇచ్చిన జాబితాను అనుసరించి అనుమతిస్తామని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. అయితే సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నేతల జాబితా తయారు చేశారట ఎంపీ చిన్ని. అందులో సౌమ్య పేరు లేదట. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేర్లు ఖరారు చేయడానికి ఎంపీ ఎవరని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారట. ఓ దళిత మహిళ ఎమ్మెల్యేను అవమానించారు అంటూ ఎంపీ కేసినేని చిన్ని పై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి.
* వసంత కృష్ణ ప్రసాద్ తో
మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( mylavaram MLA Vasantha Krishna Prasad ) సైతం ఎంపీ చిన్ని తో విభేదిస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు అయినా.. ఓ వ్యాపారం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేశినేని నాని పై ఆయన సోదరుడు చిన్ని గెలిచారు. అయితే నాని మాదిరిగానే ఇతర ఎమ్మెల్యేలతో ఆయన అంతగా కలివిడితనం లేదు. ఇదే ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తోందని టిడిపి హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : అమరావతిలో ఏడాదిలో చంద్రబాబు కొత్త ఇల్లు.. భూమి పూజ.. నిర్మాణ బాధ్యత ఆ సంస్థదే!