Gadde Ram Mohan Son: వచ్చే ఎన్నికల్లో చాలామంది వారసులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి యువనాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఈసారి యువతకు ఎక్కువగా టిక్కెట్లు ఇవ్వనున్నారు. ప్రధానంగా పార్టీ నేతల వారసులకు పెద్దపీట వేయనున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే సీనియర్ నేతలంతా పక్కకు తప్పుకొని తమ వారసులకు లైన్ క్లియర్ చేశారు. ఈసారి మరి కొంతమంది పక్కకు తప్పుకొని వారసులకు అవకాశం కల్పించనున్నారు. అటువంటి వారు ఇప్పటికే యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ టీం అంటూ ఒకటి ఏర్పడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగా విజయవాడ గద్దె క్రాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తనయుడు. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకు చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో గద్దె రామ్మోహన్రావు ది ప్రత్యేక స్థానం. మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయనపై జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. చివరకు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను ప్రయోగించారు. మరోసారి ఆయనకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ గట్టిగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి తాను పోటీ నుంచి తప్పుకుని కుమారుడు క్రాంతికి అవకాశం ఇవ్వాలని రామ్మోహన్రావు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
గద్దె రామ్మోహన్ రావు మంచి పట్టున్న నాయకుడు. పారిశ్రామికవేత్త కావడంతో నిత్యం సేవా కార్యక్రమాలు జరుపుతుంటారు. 1994లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ రావు. ఆ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప టిడిపి అభ్యర్థి పై పదివేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడే టిడిపి నాయకత్వం ఆయనను పార్టీలో చేర్చుకుంది. 1999లో అనూహ్యంగా విజయవాడ టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ ఎందుకో తర్వాత కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరమయ్యారు. 2009లో మరోసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక పట్టు సాధించుకోవడంతో ఇప్పుడు కుమారుడు క్రాంతిని రంగంలోకి దించేందుకు నిర్ణయించారు. టిడిపి హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్రాంతి తన పని తాను చేసుకుంటున్నారు.