Lionel Messi India Tour : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్ పర్యటన దేశవ్యాప్తంగా భారీ ఉత్కంఠను రేపుతోంది. అయితే ఈ మెస్సీ మానియా కోల్‌కతాలో ఒక్కసారిగా గందరగోళానికి దారి తీసింది. అభిమానుల అంచనాలు, వాస్తవ పరిస్థితి మధ్య తేడాతో కోల్‌కతాలో ఫ్యాన్స్ ఆగ్రహానికి దిగగా… ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌పై పడింది. ఇక్కడైనా పరిస్థితి అదుపులో ఉంటుందా? మ్యాచ్ సాఫీగా జరుగుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కోల్‌కతాలో ఫ్యాన్స్ ఆగ్రహం.. విధ్వంసం
మెస్సీ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం మొత్తం మెస్సీ నినాదాలతో మార్మోగింది. కానీ మ్యాచ్ సమయానికి మెస్సీ కేవలం కొన్ని నిమిషాలే కనిపించి వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆగ్రహం తట్టుకోలేక కొందరు ఫ్యాన్స్ స్టేడియంలో కుర్చీలు ధ్వంసం చేయడం, వాటర్ బాటిళ్లు విసరడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో మెస్సీ స్టేడియం సొరంగం మార్గం ద్వారా బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. గందరగోళాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఈవెంట్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్‌లో సాయంత్రం పరిస్థితేంటి?
కోల్‌కతాలో జరిగిన ఘటనల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే మెస్సీ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’లో భాగంగా మెస్సీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. ఇక్కడ జరిగే ఈవెంట్ ముందుగా సంగీత విభావరితో ప్రారంభమై, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 9 వర్సెస్ మెస్సీ ఆల్‌స్టార్స్ జట్ల మధ్య 20 నిమిషాల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ మైదానంలోకి దిగనుండగా… అనంతరం పెనాల్టీ షూటౌట్ కూడా ప్లాన్ చేశారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
కట్టుదిట్టమైన భద్రత.. పోలీసుల అప్రమత్తత
కోల్‌కతా ఘటన పునరావృతం కాకుండా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. టికెట్, పాస్ ఉన్న వారికే ప్రవేశం కల్పిస్తూ… స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఫుట్‌బాల్‌కు కొత్త గుర్తింపు?
హైదరాబాద్‌లో ఈ మ్యాచ్ విజయవంతంగా జరిగితే రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోల్‌కతాలో చేదు అనుభవం తర్వాత… హైదరాబాద్‌లో మెస్సీ మానియా పండుగలా మారుతుందా? లేక ఇక్కడ కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయా? అన్నది సాయంత్రం తేలనుంది.