TDP Media Yanamala Ramakrishnudu: తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి ఒక ప్రత్యేక వ్యూహం అంటూ ఒకటి ఉంటుంది. ఆ పార్టీ విధానాలను అనుసరించి అనుకూల మీడియాలో కథనాలు ప్రచురితం అవుతాయి. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రాధాన్యత అంశాలు మారుతుంటాయి. ప్రస్తుతం టిడిపి అనుకూల మీడియాలో లోకేష్ బృందానికి ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతోంది. వారితో పోల్చుకుంటే సీనియర్లకు ఏమంత ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఇటీవల పార్టీలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకనో ఆయన విషయంలో టిడిపి అనుకూల మీడియాలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో రకరకాల చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడి శకం ముగిసినట్లేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. కూతురుకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. అల్లుడికి పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చారు. ఆ ఇద్దరూ గెలిచారు. అయితే ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేసిన యనమల రామకృష్ణుడు కు మాత్రం ఎటువంటి చాన్స్ లేకుండా పోయింది.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
* టిడిపిలో ఎనలేని ప్రాధాన్యం..
తెలుగుదేశం పార్టీకి అధికారంతో సంబంధం లేకుండా యనమల రామకృష్ణుడుకు( yanamala Rama krishnudu) ఎనలేని ప్రాధాన్యమిస్తూ పదవులు ఇచ్చారు చంద్రబాబు. చివరకు 2014లో ఆయన ఎమ్మెల్సీగా ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా తన క్యాబినెట్లో చోటిచ్చారు. 2019లో పార్టీ ఓటమి చవిచూసినా.. యనమల రామకృష్ణుడు కు ఎమ్మెల్సీగా ప్రమోట్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మంత్రి అయ్యారు. అది కూడా కీలక పోర్టు పోలియోను దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు యనమల రామకృష్ణుడు భవిష్యత్తుపై రకరకాల చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. తన జీవితంలో చివరి కోరిక మిగిలిపోయిందని.. పెద్దల సభ ద్వారా పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఉందని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.
* పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా..
అయితే యనమల రామకృష్ణుడు కు తప్పకుండా రాజ్యసభ పదవి కానీ.. గవర్నర్( governor) పోస్ట్ కానీ దక్కుతుందని అంతా భావించారు. విస్తృత స్థాయిలో చర్చ కూడా సాగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఇటీవల మహానాడులో యనమల రామకృష్ణుడు కు ప్రాధాన్యత దక్కింది. కానీ ఆయన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ టీం ఎంట్రీ తర్వాత యనమల రామకృష్ణుడికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో సానా సతీష్ అనే యువనేత యాక్టివ్ అయిన తర్వాత.. డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు తీసుకున్నాక యనమల రామకృష్ణుడిని సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు టిడిపి అనుకూల మీడియా కూడా యనమలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం పై.. ఆయన అనుచరుల్లోనే ఒక రకమైన బాధ వినిపిస్తోంది. ఇక మా సార్ కు రాజకీయ వీడ్కోలు తప్పదా అన్నట్టు వారు చర్చించుకోవడం కనిపిస్తోంది.