Gradution MLC Election : టిడిపికి ప్రాణ సంకటంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. జనసేన సహకారం పై అనుమానం

ఏపీలో మరో ఎన్నికకు తెరలేచింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే జనసేన సహకారం పై అనుమానం ఉండడంతో వైసిపి ఆశలు పెట్టుకుంది.

Written By: Dharma, Updated On : October 2, 2024 1:14 pm

Gradution MLC Election

Follow us on

Gradution MLC Election :  ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. దీంతో ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సత్తా చాటాలని భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకుంది ఆ పార్టీ. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి గట్టి సవాల్ ఇవ్వాలని చూస్తోంది. జగన్ సైతం ఇప్పటికే వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న టిడిపి సైతం అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరో సమరానికి తెరలేచింది. అయితే కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న టిడిపి గెలవాలంటే.. జనసేన మద్దతు కీలకం. అయితే ఈ రెండు పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థులు.. జనసేన ఎమ్మెల్యేలకు మరో అధికార కేంద్రంగా మారే అవకాశం ఉంది. అందుకే వారు సహకరిస్తారా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు సహకరిస్తే గాని టిడిపి అభ్యర్థులు గెలిచే ఛాన్స్ లేదు. కూటమిలోని ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ గెలుపు కోసం వ్యూహం పన్నుతోంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* బరిలో ఆలపాటి రాజా
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. చైతన్యవంతమైన జిల్లాలుగా గుర్తింపు పొందిన ఈ రెండు జిల్లాల్లో పట్టబద్రులు ఎటువైపు మొగ్గుచూపుతారు అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. రాజా సుదీర్ఘకాలం తెనాలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ జనసేనతో పొత్తులో భాగంగా ఆ సీటును ఆ పార్టీకి కేటాయించారు. దీంతో ఆలపాటి రాజా అసంతృప్తికి గురయ్యారు. కానీ చంద్రబాబు కలుగజేసుకొని సర్ది చెప్పారు. భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తానని.. సహకరించాలని కోరారు. దీంతో జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా నిలిచారు ఆలపాటి రాజా. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. నాదేండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఎంపికయ్యారు. అయితే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆలపాటి రాజాకు నాదేండ్ల మనోహర్ సహకారం అవసరం. అయితే నియోజకవర్గంలో మరో అధికార కేంద్రంగా ఆలపాటి రాజా మారే అవకాశం ఉంది. అందుకే నాదేండ్ల మనోహర్ సహకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.

* ఉభయగోదావరి జిల్లాల్లో
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీట్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ గెలుపునకు రాజశేఖర్ కృషి చేశారు. అయితే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాజశేఖర్ పోటీ చేయాలని భావిస్తున్నారు.ఒకవేళ ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే నియోజకవర్గంలో తనకు ప్రత్యామ్నాయం అవుతారని నానాజీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన సైతం సహకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

* జనసేన కొత్త డిమాండ్
అయితే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లలో ఒకదానిని జనసేనకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.అప్పుడే కూటమి పార్టీల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది.అయితే ఇప్పటికే అభ్యర్థులకు మాటిచ్చామని.. ఆ రెండు సీట్లు టిడిపికి విడిచి పెట్టాలని తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అంతిమంగా ఇది రెండు పార్టీల మధ్య సమన్వయ లోపానికి కారణం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ల విషయంలో వైసిపి ప్రతిష్టాత్మకంగా ఉంది. రెండు పార్టీల మధ్య సమన్వయం లోపిస్తే ఈజీగా గెలుపొందవచ్చని భావిస్తోంది. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.