Durga Navratri 2024: అమ్మ.. ఆది పరాశక్తి.. దుర్గమ్మ ఇలా ఏ పేరుతో ఆరాధించినా భక్తులను కరుణించే కరుణామూర్తి అమ్మవారు. ఆశ్వయిన మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజులు శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అష్ట కష్టాలు తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ప్రతికూల శక్తిని ఇంట్లో నుంచి తొలగించేందుకు దేవీ ఆరాధన దోహదపడుతుంది. దారిద్య్రం తొలగిపోతుంది. తప్పుడు మార్గంలో వెళ్లేవారు కూడా సన్మార్గంలో పయనిస్తారు. దసరా సమయంలో అమ్మవారిని నిత్యం షోడసోపచార పూజలు నిర్వహిస్తారు. వాస్తవానికి త్రికాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మవారిని ఆరాధించాలి. నేటి పరిస్థితుల్లో మూడు పూజలు పూజలు కుదరడం లేదు. అందుకే నిత్యం ఉదయం, సాయంత్రం పూజలు చేస్తారు. శక్తి కొలది నైవేద్యం సమర్పించాలి. నిత్యం ఒకే సమయంలో పూజ చేయడం మంచింది. ఇక షోడసోపచార పూజ చేయలేని వారు అమ్మవారికి దీప, ధూప నైవేద్యాలు సమర్పించి దుర్గా అష్టోత్తరం, కవచం, లలితా సహస్రనామం..చదువుకోవడం మంచిది.
కౌమారీ పూజ
దసరా నవరాత్రుల్లో కౌమారీ పూజ చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. పదేళ్లలోపు చిన్నారులను ఇంటికి ఆహ్వానించి బాల పూజ చేయాలి. బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రంలో బాల పూజ గురించి ప్రత్యేకంగా వివరించారు. భండాసురుడు అనే రాక్షసుడి సంతానం దేవతలను హింస పెట్టేవారు. హంసలు లాగే రథంపై వచ్చి చిన్నారి భండాసురుడి 30 మంది పిల్లలను సంహరించింది. దీంతో అప్పటి నుంచి బాలారాధన ప్రారంభించారు. రెండేళ్ల బాలికల నుంచి పదేళ్ల బాలికల వరకూ పూజించవచ్చు. దసరా నవరాత్రుల్లో చేయడం వలన విద్య, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి.
అపరాజిత ఆరాధన..
ఇక విజయ దశమి రోజు అపరాజిత దేవిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. దుర్గాదేవి అంశలో ఇదో అవతారం. అపరాజిత అంటే ఎవరిచేతిలోనూ ఓటమి లేనిది అని అర్థం. భూమండలంపై ఆధర్మం పెరిగినప్పుడు ఉద్భవించింది. ఈ అమ్మవారిని ఆరాధిస్తే అపజయమే ఉండదు. దేవీ పురాణం, చండీ సప్తశతిలోనూ అమ్మవారి గురించిన వర్ణన ఉంది.
శమీవృక్షం పూజ
ఇక విజయ దశమి రోజు శమీవృక్షంలో అమ్మవారి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దశమి రోజు శమీవృక్షాన్ని పూజించాలి. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు తమ ఆయుధాలను భద్రపరిచింది. శమీవృక్షంపైనే. ఉత్తర గోగ్రహణ సమయంలో అజ్ఞాతవాసం ముగించుకుని ఆ శీమీ వృక్షానికి నమస్కరించి ఆయుధాలను తిరిగి తీసుకుని విజయం సాధించారు. అందుకే జమ్మిచెట్టును విజయానికి చిహ్నంగా భావిస్తారు.
పాటించాల్సిన నిమయాలు
ఇక తొమ్మిది రోజులు అమ్మవారని పూజించే వారు ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం ముట్టుకోవద్దు. లౌకిక విషయాలపై మనసు వెళ్లనీయవద్దు. నవదుర్గలకు ఒక్కో దుగ్గకు ఒక్కో శ్లోకం ఉంది.. వాటిని నిత్యం చదువుకోవాలి. తొమ్మిది రోజులు ఒకపూట భోజనం చేయాలి. నేలపై నిద్రించాలి. అనారోగ్యంతో ఉండేవారు భక్తితో అమ్మవారికి నమస్కరిస్తే చాలు.