TDP: ఆ టీం అంటేనే దడుచుకుంటున్న టిడిపి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంగతి చెప్పనవసరం లేదు. ఆయన జగన్ కు అత్యంత విధేయుడు. తాజాగా పెన్షన్ వివాదంలో అధికార పార్టీకిఅనుకూలంగా వ్యవహరించారన్న విమర్శ ఉంది.ఆయన తీరుతోనే పెన్షన్లు ఆలస్యం అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : April 3, 2024 11:09 am

TDP

Follow us on

TDP: సాధారణంగా అధికారులపై రాజకీయ విమర్శలు రావడం సహజం. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు కాబట్టి వారిపై ఫిర్యాదులు వస్తాయి. అయితే ఏపీలో మాత్రం ఈ లెక్కకు మించి ఉన్నతాధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముంగిట అధికారులపై ఆరోపణలు రావడంతో ఎలక్షన్ కమిషన్ సైతం సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటలిజెన్స్, విజిలెన్స్ విభాగాల అధికారులపై ఈసీ వేటు వేయడం ఖాయంగా తేలుతోంది. వారి ప్రవర్తన తీరు అభ్యంతరకరంగా ఉండడం, విపక్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఈసీ పై ఏర్పడింది.

ఇప్పటికే చాలామంది అధికారులపై ఈసీ వేటు వేసింది. ఈ జాబితాలో కలెక్టర్లు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదుకు సహకరించారని చాలామంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి సైతం పక్కకు తప్పించే అవకాశం ఉంది. వాస్తవానికి ఆయన రెగ్యులర్ డిజిపి కాదు. కేవలం ఇంచార్జ్ తోనే కొనసాగిస్తూ వచ్చారు. రెగ్యులర్ డిజిపిగా ఆయనకు అర్హత లేదు. ఆయనకంటే సీనియారిటీ ఉన్న పదిమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఎక్కడో 11 నెంబర్ తో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి ని డిజిపి కుర్చీలో కూర్చోబెట్టారు.ఎన్నికల సమయంలో ఇంచార్జ్కి ఒప్పుకునే స్థితిలో ఈసీ లేదు. అందుకే రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తి రానున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంగతి చెప్పనవసరం లేదు. ఆయన జగన్ కు అత్యంత విధేయుడు. తాజాగా పెన్షన్ వివాదంలో అధికార పార్టీకిఅనుకూలంగా వ్యవహరించారన్న విమర్శ ఉంది.ఆయన తీరుతోనే పెన్షన్లు ఆలస్యం అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది.ఎన్నికల్లో ఆయన ఉంటే.. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగదని టిడిపి ఆరోపిస్తోంది. ఆయనను మార్చేయాలని కోరుతోంది. కచ్చితంగా ఈసీ మార్పు చేస్తుందని టిడిపి ఆశిస్తోంది. మరోవైపు ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గురించి చెప్పనవసరం లేదు.ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు ఉండాలో అన్నీ ఉన్నాయి.చంద్రబాబు, లోకేష్, పవన్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.దీనిపై వర్ల రామయ్య నేరుగా ఫిర్యాదులు చేశారు. మరోవైపు విజిలెన్స్ లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వీరంతా ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఈ టీంను మార్చాలని టిడిపి పట్టుబడుతోంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.