Mayank Yadav: అత్యంత వేగంగా బంతులేస్తున్న మయాంక్.. అతడి వేగం వెనుక అసలు రహస్యం అదే..

మాయాంక్ యాదవ్ వయసు 21 సంవత్సరాలు. మంగళవారం అతడు వేసిన బౌలింగ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే బుల్లెట్ వేగంతో అతడు బంతులు సంధిస్తుండడాన్ని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 3, 2024 11:03 am

Mayank Yadav

Follow us on

Mayank Yadav: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్నో జట్టు 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. డికాక్ 81, నికోలస్ పురన్ 40* చెలరేగి ఆడటంతో లక్నో భారీ స్కోర్ సాధించింది. బెంగళూరు బౌలర్లు సరిగా బౌలింగ్ చేయలేకపోవడం, చెత్త ఫీల్డింగ్ తో లక్నో జట్టు భారీగా పరుగులు సాధించింది.

అనంతరం చేజింగ్ ప్రారంభించిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకు అలౌట్ అయింది. బెంగళూరు ఆటగాళ్లల్లో లోమ్రర్ (33), రజత్ పటిదార్ (29) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మైదానం మీద ఉన్న ప్రేమను వినియోగించుకుంటూ లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగేలా బంతులు సంధించాడు. కీలకమైన బెంగళూరు ఆటగాళ్లను అవుట్ చేశాడు.. మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారం అతడు అందుకోవడం ఇది వరుసగా రెండవసారి. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ మయాంక్ ఇదే స్థాయిలో చెలరేగి బౌలింగ్ చేశాడు. అప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు.

మాయాంక్ యాదవ్ వయసు 21 సంవత్సరాలు. మంగళవారం అతడు వేసిన బౌలింగ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే బుల్లెట్ వేగంతో అతడు బంతులు సంధిస్తుండడాన్ని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు వేగవంతమైన బౌలర్ గా అతడు వినతికెక్కాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో తన ఘనతను తన పునర్లిఖించాడు. గంటకు 156.7 km వేగంతో బంతులు విసిరి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన నాలుగవ బంతిని విసిరిన ఆటగాడిగా మయాంక్ యాదవ్ నిలిచాడు. తొలి స్థానంలో షాన్ టెయిట్ (157.7 కిలోమీటర్లు/ గంటకు) కొనసాగుతున్నాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్న తర్వాత వేగవంతమైన బంతులు ఎలా సంధిస్తున్నావని ప్రశ్నిస్తే.. “ఈ వేగంతో బంతులను విసరడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను పౌష్టికాహారం తింటాను. శుభ్రంగా నిద్రపోతాను. మైదానంలో తీవ్రంగా శ్రమిస్తాను. బంతి పట్టుకునే విధానంపై నాకు ఒక స్పష్టత ఉంటుంది. వేగంపై నాకు ఒక అవగాహన ఉంటుంది. కచ్చితత్వంతో బంతులు వేయాలంటే ఇవన్నీ పాటించాలి. ప్రస్తుతానికి నేను తీసుకునే ఆహారం పై మరింత శ్రద్ధ తీసుకోవాలని భావిస్తున్నాను. నేను ఎక్కువగా మంచు గడ్డలతో స్నానం చేస్తుంటాను. వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. లక్నో జట్టు సాధించిన రెండు విజయాలలో నేను భాగస్వామిని కావడం మరింత ఆనందంగా ఉంది. అయితే నా లక్ష్యం చాలా పెద్దది. భారత జాతీయ జట్టులో నేను ఆడాలి. ఇక ఈ మ్యాచ్ లో నా ఫేవరెట్ వికెట్ కామెరున్ గ్రీన్ ను పెవిలియన్ పంపించడం” అని మయాంక్ యాదవ్ అన్నాడు. వేగవంతమైన బంతులు సంధించడం.. లక్నో జట్టును గెలిపించడంతో మయాంక్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో మయాంక్ యాదవ్ 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. రజత్ పటి దార్, మాక్స్ వెల్, గ్రీన్ ను అవుట్ చేసి బెంగళూరు జట్టు వెన్ను విరిచాడు. పటిదార్, మాక్స్ వెల్ క్యాచ్ అవుటయ్యారు. గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.