Chandigarh: సరిగ్గా ఏడాది క్రితం.. అల్లు రామలింగయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్, చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరు అల్లు రామలింగయ్య తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అయితే అందరికంటే భిన్నంగా అనిపించింది అల్లు అర్జున్ అలియాస్ బన్ని చెప్పిన స్టోరీ. ఇప్పుడంటే ఐకాన్ స్టార్ అయిపోయాడు గాని.. పుష్ప రాజ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు గాని.. ఒకప్పుడు అల్లు అర్జున్ కు ఇంతటి గుర్తింపు లేదు. అతడికి చదువు అబ్బకపోవడం వల్ల ఇంట్లో వాళ్లకు ఇబ్బందిగా ఉండేది. ఏమైపోతాడేమోనని బెంగగా ఉండేది. స్వతహాగా అల్లు రామలింగయ్య కు ముందు చూపు ఎక్కువ కాబట్టి.. తన మనవడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్యాంకులో అతని పేరు మీద కొంత డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య కన్నుమూశారు. కొంతకాలానికి ఆ నగదు అల్లు అర్జున్ చేతికి వచ్చింది. ఇదేంటి నాకు డబ్బు వచ్చింది అంటూ.. ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అసలు విషయాన్ని అల్లు అరవింద్ చెప్పడంతో కన్నీటి పర్యతమయ్యాడు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య జయంతి వేడుకల్లో చెప్పాడు. తన తాత తన గురించి ఎంత తాపత్రయపడ్డాడో.. ఎంత ముందుచూపుతో వ్యవహరించాడో చెప్పుకుంటూ అల్లు అర్జున్ ఉద్వేగానికి గురయ్యాడు. సరిగా ఇలాంటి స్టోరీనే ఓ మనవడి జీవితంలో జరిగింది. తాత పొదుపు చేయడంతో అతని బతుకు బిందాస్ గా మారింది.
మనలో చాలామందికి కోటీశ్వరులు కావాలని ఉంటుంది. రాత్రికి రాత్రే మిలియనీర్లు అయిపోవాలని కల ఉంటుంది. కాకపోతే అందరూ అలా కారు. అలా కోటీశ్వరులు కావాలంటే.. కోట్లకు కోట్లు వెనకేయాల్సిన పనిలేదు. జస్ట్ వందల్లో పొదుపు చేస్తే చాలు.. అది మనల్ని శ్రీమతులను చేస్తుందని ఓ సీనియర్ సిటిజన్ నిరూపించాడు.. అప్పట్లో ఆయన 500 పెట్టుబడి పెడితే.. ఇప్పుడు ఏకంగా అది 3.75 లక్షలకు చేరుకుంది. ఆ సీనియర్ సిటిజన్ పెట్టిన పెట్టుబడి.. రిటర్న్స్ రూపంలో రావడంతో ఆయన మనవడు ఎగిరి గంతేస్తున్నాడు.. తన తాతకు ధన్యవాదాలు చెబుతున్నాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
పంజాబ్ లోని చండీగఢ్ ప్రాంతానికి చెందిన తన్మయ్ మోతీవాలా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నాడు. ఒకరోజు తన ఇంటిలో వస్తువులను సర్దుతుండగా.. తన తాతయ్య వినియోగించిన ట్రక్ పెట్టె కనిపించింది. అందులో ఏం వస్తువులు ఉన్నాయోనని మోతీవాలా తెరిచి చూశాడు. అయితే అందులో అతనికి ఒక విలువైన పత్రం కనిపించింది. ఇంకేముంది మోతీవాలా ఎగిరి గంతేశాడు. తాత పెట్టిన పెట్టుబడి చూసి ఆనందంతో కేరింతలు కొట్టాడు.
ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాతయ్య 500 విలువైన ఎస్ బీ ఐ షేర్లు కొనుగోలు చేసినట్టు.. వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు మోతివాలాకు కనిపించాయి. తన తాతయ్య షేర్లు కొనుగోలు చేసి తన వద్దే పెట్టుకున్నాడు.. ఎవరికీ అమ్మలేదు. ఈ నేపథ్యంలో మోతీ వాలా 500 తో తన తాతయ్య కొనుగోలు చేసిన షేర్ల తో ఎంత లాభం వచ్చిందో కనుక్కున్నాడు. మోతీ వాలా తాతయ్య 1994లో ఒక్కో షేర్ పది రూపాయల చొప్పున 500 కు మొత్తం 50 షేర్లు కొనుగోలు చేశాడు. ఇప్పుడు వాటి విలువ 3.75 లక్షలకు చేరింది. అంటే ఆయన పెట్టిన పెట్టుబడి మీద 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయి.. దీంతో మోతీ వాలా సంబర పడుతున్నాడు. తన తాతయ్య ముందు చూపుకు గర్వపడుతున్నాడు.. తన తాతయ్య కొనుగోలు చేసిన ఎస్ బీఐ షేర్లకు సంబంధించిన ధ్రువపత్రాలను ట్విట్టర్ ఎక్స్ వేదికగా మోతీ వాలా పంచుకున్నాడు.. దీంతో నెటిజన్లు.. మోతీ వాలా తాతయ్య ముందు చూపును ప్రశంసిస్తున్నారు. ఏ రంగంలోనైనా భవిష్యత్తును ఊహించాలని.. అప్పుడే దీర్ఘకాలిక లాభాలను ఆర్జించవచ్చని చెబుతున్నారు. దానికి మోతీ వాలా తాతయ్య కొనుగోలు చేసిన ఎస్ బీఐ షేర్లే ఉదాహరణ అని చెప్తున్నారు.
#ETTrending | In a surprising turn of events, a doctor in #Chandigarh stumbled upon a hidden treasure trove within his family’s #assets. Dr. Tanmay Motiwala, a pediatric surgeon, unearthed old share certificates from the #StateBankOfIndia while organizing his family’s financial… pic.twitter.com/Sy1Ze9EUSe
— Economic Times (@EconomicTimes) April 2, 2024