Chandrababu : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో తెలుగు దేశం పార్టీ మధ్య పొరపొచ్చాలు ఎక్కువయ్యాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత ఎన్నికలకు ముందుకు ఇరు పార్టీలు దూరంగా జరిగాయి. ఆ తరువాత ఒకటి రెండు సందర్భాల్లో ప్రధాని మోడీని చంద్రబాబు కలుసుకున్నా, కుశల ప్రశ్నలు మినహా పార్టీకి సంబంధించిన విషయాలపై చర్చలు పెద్దగా జరగలేదని ఆ పార్టీ నాయకులు పలు సందర్భాల్లో అన్నారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి దూరంగా జరిగిన చంద్రబాబు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. రాబోవు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారనే పుకార్లకు ఫులిస్టాప్ పెట్టి, కేంద్రంలోని బీజేపీపై పోరు సలిపేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తున్నారు.
వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ బీజేపీ పెద్దలు చెప్పిన దానికి జీ హుజూర్ అనడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఆయనకు సమస్యలు ఎదురైన ప్రతీసారి హస్తినకు పయనం అవుతున్నారు. రాష్ట్రానికి అప్పులను ఇబ్బడిముబ్బడిగా తీసుకొచ్చి పాలనను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్రంలోని బీజేపీని వాడుకున్నట్లు మరే రాష్ట్రం వాడుకోలేదనే స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అంతర్గతంగా బీజేపీతో కలిసి ఉందనే ప్రచారం ప్రారంభమైంది. అందుకు చాలా ఉదాహరణలను టీడీపీ నేతలు చూపుతున్నారు.
పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నా, వైసీపీని గద్దె దించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు బీజేపీ నేతల నుంచి సహకారం అంతగా లేదని తెలుస్తోంది. రాష్ట్రంలోని వైసీపీని అంటిపెట్టుకొని ఉంటూనే, పవన్ కల్యాణ్ ను కూడా దగ్గరగా ఉంచుకుంటున్నారు. జనసేన రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని పవన్ చెబుతున్నా, ఆయన కంటే ఎక్కువగా వైసీపీనే నమ్ముతున్నట్లు బీజేపీ అధిష్టానం కనిపిస్తోంది.
రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు అప్పగించిన తరువాత బీజేపీ జవసత్వాలు నింపే పనిలో నిమగ్నమయ్యారు. ఆమె నియామకంతో టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న కమ్మ సామాజిక వర్గంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి మార్పు కనిపించకపోయినా, భవిష్యత్తులో కొంత కదలిక ఉంటుందని అంటున్నారు. అలాగే, పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీని బీజేపీకి దగ్గర చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా, అందుకు తగ్గ ఆశించిన స్పందన రావడం లేదు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే చంద్రబాబు కేంద్రంలోని బీజేపీపై పోరు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య కటీఫ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం బీజేపీపై పోరు సాగించాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆందుకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉండదని తేలిపోయింది. ఇక, బీజేపీపై వైఖరిని ప్రకటించాల్సింది వైసీపీనే.