YCP : ఆ నేతను వదిలించుకునే పనిలో వైసీపీ

అయితే సన్యాసిపాత్రుడు సేవలు అవసరం లేదని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చిందన్న మాట. మరి ఆయన తిరిగి సోదరుడి నీడలో చేరుతారా? దానికి అయ్యన్నపాత్రుడు అంగీకరిస్తారా? అన్నది చూడాలి.

Written By: Dharma, Updated On : July 20, 2023 3:56 pm
Follow us on

YCP : గత ఎన్నికల్లో ప్రజలను వర్గ, కుల, మతాలుగా విభజించి వైసీపీ విజయాన్ని ఒడిసి పట్టుకుంది. చివరకు కుటుంబాలను సైతం అడ్డగోలుగా విభజించింది. దశాబ్దాలుగా రాజకీయంగా కలిసి ఉన్న చాలా కుటుంబాలను విడదీసి లబ్ధి పొందింది. పచ్చని కుటుంబాలు సైతం విడిపోయి జగన్ సీఎం అయ్యేందుకు జెండా పట్టాల్సి వచ్చింది. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు ఇదే మాదిరిగా వైసీపీకి చేరువయ్యారు.అయితే ఈ మధ్యన ఐ ప్యాక్ ఇచ్చిన టాస్కును పూర్తిచేయలేకపోతున్నారో? లేక ఆయన వల్ల వైసీపీలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయో తెలియదు కానీ వైసీపీ హైకమాండ్ పక్కన పడేసింది.

విశాఖ డీసీసీబీ చైర్మన్ గా ఉన్న చింతకాయల సన్యాసిపాత్రుడు భార్య అనితను హైకమాండ్ తప్పించింది. ఆ స్థానంలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోలా గురువులను నియమించింది. ఆయనకు పదవి ఇవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అనితను తప్పించి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 13 డీసీసీబీలకుగాను నాలుగు జిల్లాల్లోనే మార్పులు చేశారు. మార్చిన చోట రాజకీయ పదోన్నతుల కోసం చేశారు. కానీ విశాఖలో మాత్రం సన్యాసిపాత్రుడుని వదిలించుకునేందుకే చేశారని టాక్ నడుస్తోంది.

దశాబ్దాలుగా సన్యాసిపాత్రుడు సోదరుడు అయ్యన్నపాత్రుడి నీడలో రాజకీయాలు చేశారు. ఎన్నో పదవులు చేపట్టారు. అయితే అన్నదమ్ములిద్దర్నీ విడగొడితే విజయం సునాయాసం అవుతుందని ఐ ప్యాక్ ఒక అంచనా వేసింది. భయం, ప్రలోభాలు పెట్టి సన్యాసిపాత్రుడ్ని వైసీపీ వైపు తిప్పుకున్నారు. అనుకున్నట్టే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సన్యాసిపాత్రడు భార్య అనితకు డీసీసీబీ పగ్గాలు అప్పగించారు. అయితే సన్యాసిపాత్రుడు అంతటితో సంతృప్తి పొందలేదు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారుచేసే పనిలో పడ్డారు. దీంతో హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో మాత్రమే గెలిచామని.. సన్యాసిపాత్రుడు వెనుక ఒక్క టీడీపీ నాయకుడికి కూడా తేలేకపోయారని.. ఎన్నికల తరువాత కూడా టీడీపీ శ్రేణులను ఆకర్షించలేకపోయారని ఐప్యాక్ టీమ్ హైకమాండ్ కు ఒక నివేదిక ఇచ్చింది. అదే సమయంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గం కడుతున్నారని సన్యాసిపాత్రుడిపై ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు కోలా గురువులకు ఏదో ఒక పదవి క్రియేట్ చేయాలి. అందుకే డీసీసీబీ పదవిని అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే సన్యాసిపాత్రుడు సేవలు అవసరం లేదని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చిందన్న మాట. మరి ఆయన తిరిగి సోదరుడి నీడలో చేరుతారా? దానికి అయ్యన్నపాత్రుడు అంగీకరిస్తారా? అన్నది చూడాలి.