https://oktelugu.com/

Thammineni  Seetharam : తెరపైకి తమ్మినేని ఫేక్ డిగ్రీ.. ఈసారి కఠిన చర్యలు తప్పవా?

డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ పెట్టి లా అడ్మిషన్ తీసుకున్నారన్నది మాజీ స్పీకర్ తమ్మినేని పై ఉన్న ఆరోపణ. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో అనుకూల ప్రభుత్వాలు ఉండడంతో ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పూర్తి ఆధారాలతో టిడిపి ఈ అంశంపై దృష్టి పెట్టింది.

Written By:
  • Dharma
  • , Updated On : August 23, 2024 / 12:32 PM IST

    Thammineni Seetharam

    Follow us on

    Thammineni  Seetharam  :తమ్మినేని సీతారాం సీనియర్ మోస్ట్ లీడర్. వైసీపీ హయాంలో శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా.. రాజకీయ విమర్శలు చేయడంలో ముందుండేవారు. దానిని సమర్థించుకునే వారు కూడా. తాను ముందుగా ఎమ్మెల్యేను. తరువాతే స్పీకర్ నని చెప్పుకొచ్చేవారు. నాడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును టార్గెట్ చేసుకొని మాట్లాడేవారు. చివరకు శాసనసభ వేదికగా చంద్రబాబు కుటుంబం పై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ ప్రస్తుతం తమ్మినేని మెడకు చుట్టుకుంటున్నాయి. నాడు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వైసిపి నేతల అవినీతిపై టిడిపి నాయకులు దృష్టి పెట్టారు. మరోవైపు లోకేష్ రెడ్ బుక్ సంకేతాలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం మరోసారి బయటకు వచ్చింది. దీనిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని తేల్చాలని కోరారు. దీంతో మరోసారి ఇదో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తప్పకుండా సీరియస్ దర్యాప్తునకు దిగే అవకాశం కనిపిస్తోంది.

    * టిడిపిలోనే సుదీర్ఘకాలం
    తమ్మినేని పూర్వాశ్రమం టిడిపి. తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత టిడిపిలోకి వచ్చారు తమ్మినేని. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో గెలిచారు. 2004 నుంచి వరుసుగా ఓటమిలు ఎదురుకాగా.. చివరి చాన్స్ అంటూ అడిగేసరికి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ స్పీకర్ గా తమ్మినేని వ్యవహరించిన తీరు మాత్రం విమర్శల పాలయ్యింది. ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి తమ్మినేని రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    * అప్పట్లోనే వెలుగులోకి
    ఏపీలో శాసనసభ స్పీకర్ గా ఉండగానే తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని ఓపెన్ యూనివర్సిటీలో లా చేసేందుకు తమ్మినేని దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ ను జతచేసినట్లు బయటకు వచ్చింది. తెలంగాణ టిడిపి నేత నర్సిరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారావివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమ్మినేని నాగర్ కర్నూల్ యూనివర్సిటీ పేరిట డిగ్రీ సర్టిఫికెట్ తీసుకున్నట్లు చూపించారు. కానీ అక్కడ అటువంటి యూనివర్సిటీ ఏమీ లేదు. దీంతో ఫేక్ గా తేలింది.అయితే అప్పట్లో తెలంగాణలో అనుకూల ప్రభుత్వం ఉండడంతో.. దీనిపై విచారణ లేకుండా పోయింది.

    * తాజాగా ఫిర్యాదు
    అయితే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో దీనిపై చలనం వచ్చింది. ఆమదాలవలసలో తమ్మినేని ప్రత్యర్థి కూన రవికుమార్ రంగంలోకి దిగారు. దీంతో తేనె తుట్టను కదిలించినట్లు అయ్యింది. దీనిపై కూటమి ప్రభుత్వం తప్పకుండా సీరియస్ యాక్షన్కు దిగే అవకాశం ఉంది. అదే జరిగితే తమ్మినేని సీతారాం ఇబ్బందుల్లో పడినట్టే. ఇటీవల ఫేక్ యూనివర్సిటీలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో.. తమ్మినేని పై విచారణ సైతం వేగవంతం అయ్యే అవకాశం ఉంది.