AP Survey: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ.. సర్వేలతో ప్రజల మూడ్ మార్చేందుకు మాత్రం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో సర్వే చేపట్టే సంస్థలు.. వాటిని ప్రకటించే మీడియా యాజమాన్యాలు విశ్వసనీయతకు పెద్దపీట వేసేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగని అన్ని సర్వే సంస్థలను ఒకేగాటిన కట్టలేము. ఏపీలో ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పగా.. ఇటీవల వస్తున్న సర్వేలు మాత్రం టీడీపీ, జనసేన, బిజెపికి అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో సర్వే సంస్థలను బిజెపి ప్రభావితం చేస్తుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పోల్ స్ట్రాటజీ అనే సంస్థ లేటెస్ట్ సర్వేను బయటపెట్టింది. వైసీపీకి 118 నుంచి 128 స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది. కూటమి 47 నుంచి 57సీట్లకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది.
అయితే ఏపీలో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం.కానీ ఆ వ్యతిరేకతను టిడిపి క్యాష్ చేసుకోలేదని విశ్లేషణలు ఉన్నాయి.అందుకే ప్రజా వ్యతిరేకత ఓటు చీలకుండా ఉండాలని టిడిపి,జనసేన కూటమి కట్టాయి.అందులోకి బిజెపి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూడు పార్టీలు చేతిలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కానీ జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని తేల్చి చెబుతున్నాయి. ఇంతవరకు వచ్చిన సర్వేల్లో దాదాపు అన్ని వైసీపీకి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టాయి. ఇండియా టుడే, సి ఓటర్ లాంటి ఒకటి రెండు సంస్థలు మాత్రం టిడిపికి ఫేవర్ గా ఫలితాలు ఇచ్చాయి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్, టైమ్స్ నౌ ఈటీజీ, లోక్ పాల్, పొలిటికల్ క్రిటిక్, జన్మత్ పోల్స్, డెక్కన్ 24*7, టైమ్స్ నౌ నవభారత్, ఎలసన్స్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, ఇండియా ఎనలైటిక, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పార్ధ దాస్, టైమ్స్ నౌ మాట్రైస్ తదితర సర్వే సంస్థలన్నీ వైసీపీకి ఏకపక్ష విజయాలను కట్టబెట్టాయి.
అయితే ఇలా వచ్చిన సర్వేల్లో ఫేక్ అధికమని ప్రజలకు తెలుసు. అదే సమయంలో విశ్వసనీయతకు పెద్దపీటవేసే సర్వే సంస్థలు కూడా ఉన్నాయన్న విషయం గమనించాలి. ఫలితాలు అనుకూలంగా వస్తే ఒకలా.. ప్రతికూలంగా వస్తే మరోలా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. అయితే ఈ సర్వేలను ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే ఇన్నాళ్లు సర్వేల్లో వైసీపీకి ఏకపక్ష విజయమని తేలగా.. ఇప్పుడు సడన్గా టిడిపికి అనుకూలంగా కొన్ని సర్వేలు రావడం విశేషం. దీంతో పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తి నడుస్తోంది. ఇప్పటివరకు సర్వేల్లో ఒక్క సి ఓటర్ మాత్రమే టిడిపికి అనుకూలంగా వచ్చిందని.. అది విశ్వసనీయత లేని సర్వే అంటూ వైసీపీ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి. జాతీయస్థాయిలో బిజెపితో టిడిపి, జనసేనకు పొత్తు కుదిరింది కాబట్టి.. బిజెపికి సపోర్ట్ చేసే అన్ని మీడియా ఛానళ్లు.. ఫేక్ సర్వేలతో ఏపీలో విరుచుకుపడతాయని.. ప్రజలు నమ్మవద్దని వైసిపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెలుస్తున్నాయి. ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా సైతం దీనిని దీటుగా ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో ఇప్పటివరకు డబ్బులు ఇచ్చి వైసిపి మేనేజ్ చేసిందని.. సర్వే సంస్థలను కొనుగోలు చేసిందని ఆరోపిస్తుండడం విశేషం. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం వైఫల్యాలు, ప్రతిపక్షాలపై విమర్శలకు ప్రాధాన్యమిచ్చిన రాజకీయ పార్టీలు.. సర్వేలను తప్పుపడుతూ దుమ్మెత్తి పోసుకుంటూ ఉండడం విశేషం.