Rangoli Competition: ఒక్క ముగ్గుతోనే ఆమె లక్షాధికారి అయ్యారు.ఒకే ఒక్క ముగ్గు ఆమెకు ఏకంగా 25 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. మీరు చదువుతున్నది నిజమే. ఒక్క ముగ్గు వేసి ఆమె ప్రైజ్ మనీ ని గెలుచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన మల్లా సునీత ( Malla Sunitha) ఈ ఘనత సాధించారు. ఆన్లైన్లో ఆమె వేసిన ముగ్గు ఎంపిక కావడంతో ఆమెకు ఏకంగా 25 లక్షల రూపాయల బహుమతి వరించింది. ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలో ఆమె వేసిన ముగ్గు ఎంపికయింది. ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనగా.. సునీత ప్రధమరాలిగా నిలిచారు.
* సంక్రాంతి సందర్భంగా..
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్( Andhra Pradesh American Association) 2024 డిసెంబర్ ఒకటి నుంచి.. 2025 జనవరి 15 వరకు ఆన్లైన్లో ముగ్గుల పోటీ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది తమ ముగ్గులను ఆన్లైన్లో పంపించారు. అయితే తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా ముగ్గు వేయడంతో సునీతకు ప్రథమ బహుమతి వరించింది. ఆగస్టు 30న గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె బహుమతి కూడా అందుకున్నారు. ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
* ఐదు రోజుల పాటు శ్రమించి..
సునీతకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ప్రకటన వచ్చేసరికి ఆమె అలర్ట్ అయ్యారు. ఆసక్తికరమైన ముగ్గు వేశారు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు కూడా. దాదాపు 19 కిలోల పిండితో.. 14 అడుగుల వెడల్పు.. 18 అడుగుల పొడవుతో ఈ ముగ్గు పూర్తి చేశారు. రోజుకు ఆరు గంటల చొప్పున ఐదు రోజులపాటు కష్టపడి తన ఇంటి ప్రాంగణంలో ఈ ముగ్గు వేశారు. ఆసక్తికరంగా ఉండడంతో నిర్వాహకులు సునీత వేసిన ముగ్గును ఎంపిక చేశారు. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం, ముగ్గులు వేయడం అంటే సునీతకు చాలా ఇష్టం. 2004లో ఓ ముగ్గుల పోటీ చూసి మొదటిసారి ముగ్గు వేసారు. రాష్ట్రస్థాయిలో బహుమతి పొందారు. గత నాలుగేళ్లుగా ఆమె అమెరికాలోనే ఉంటున్నారు. అక్కడ తెలుగువారికి ఉచితంగా ముగ్గులు నేర్పుతున్నారు. వరానికి రెండుసార్లు ఆన్లైన్ ద్వారా ఆధ్యాత్మిక శ్లోకాలు, బొమ్మలు వేయడం కూడా నేర్పిస్తుంటారు.