CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. విజనరీ నాయకుడుగా, టెక్నాలజీ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజలతో మమేకమవుతూ జనాదరణ పొందుతున్నారు. ఏడాది పాలనలో ప్రతీనెల ఒక జిల్లా లేదా ప్రాంతంలో పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు.
Also Read: పోలీస్ కండకావరం.. లాగిపెట్టి కొట్టడంతో స్పృహ తప్పిపోయిన షాపు ఓనర్: వైరల్ వీడియో
గతం లోపాలను సరిదిద్దుతూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టి, ప్రజా సంబంధాలను కొంతవరకు నిర్లక్ష్యం చేస్తారనే విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, 2024 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈ విమర్శలను పటాపంచలు చేస్తూ, ప్రజలతో నేరుగా సంబంధం బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతినెలా 1వ తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ, గత 12 నెలలుగా అత్యంత చురుకైన ప్రజా సంబంధాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన గ్రామీణ స్థాయిలో ప్రజల సమస్యలను స్వయంగా అర్థం చేసుకుంటూ, పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
నేరుగా పింఛన్ పంపిణీ..
2024 జూలై 1 నుంచి ప్రారంభమైన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా భాగస్వామ్యం కావడం ఒక విషేశం. ఈ కార్యక్రమం కేవలం పింఛన్‌ల పంపిణీకే పరిమితం కాకుండా, ప్రజలతో రోజంతా గడిపే అవకాశంగా మారింది. తాజాగా కోవూరు మల్కాపల్లి గ్రామంలో ఈ రోజు (జూలై 1, 2025) జరిగిన 12వ వరుస కార్యక్రమంలో, చంద్రబాబు పింఛన్ పంపిణీని పూర్తి చేసి, స్థానికులతో సంభాషించి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. ఈ విధానం ద్వారా, ఆయన పాలనా వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
వయసు అడ్డంకి కాదు..
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంటి విపక్ష నాయకులు చంద్రబాబు వయస్సును సమస్యగా పేర్కొంటూ విమర్శలు చేసినప్పటికీ, చంద్రబాబు తన చురుకైన పనితీరుతో వాటిని తిప్పికొడుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ, ఆయన ప్రజల మధ్యకు వెళ్లి, వారితో నేరుగా మాట్లాడటం, సమస్యలను వినడం వంటి చర్యల ద్వారా తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఇటువంటి చురుకైన ప్రజా సంబంధాలు కనిపించలేదని, చంద్రబాబు ఈ విషయంలో ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.
పాలనలో కొత్త ఒరవడి
చంద్రబాబు ఈ నూతన విధానం కేవలం పింఛన్ పంపిణీకే పరిమితం కాకుండా, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించే వేదికగా మారింది. ప్రతి నెలా గ్రామస్థాయిలో జరిగే ఈ కార్యక్రమాలు, పాలనా వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ఈ చర్యలు ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగిస్తూ, చంద్రబాబు నాయకత్వంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి.