జనసేన అధినేత పవన్ కల్యాన్ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో పవన్ కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఏపీలోని రెండు జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనలతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. శ్రమదానం అనంతరం నిర్వహించే సభకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు.
మరో వైపు పవన్ పర్యటన తో అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. రాజమహేంద్రవరంలో శ్రమదానం లో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్టా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు.