ఎన్నికల హామీలపై కూటమి ప్రభుత్వం( Alliance government ) ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్న క్రమంలో హామీల అమలుపై దృష్టి పెట్టింది. వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. వచ్చే నెలలో తల్లికి వందనం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి సైతం సన్నాహాలు చేస్తోంది. కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయంతో పాటు ఈ మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో అమరావతి పనుల ప్రారంభం, ప్రధాని రాక, సంక్షేమ పథకాలకు సంబంధించి ముహూర్తం ఖరారు చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధిగా ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు భేటీ జరగనుంది.
Also Read : ఏపీ అసెంబ్లీ ఆవరణలో జేబుదొంగలు.. డబ్బులు పోగొట్టుకున్న టిడిపి ఎమ్మెల్సీ!
* ఈరోజు మంత్రివర్గ సమావేశం..
సీఎం చంద్రబాబు( CM Chandrababu) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా డ్రోన్ పాలసీపై చర్చించనున్నారు. పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు జరగనున్నాయి. ఇప్పటికే అమరావతిలో పనుల ప్రారంభానికి వీలుగా టెండర్లను ఖరారు చేశారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ప్రధాని మోదీని ఆహ్వానించునున్నారు. ఈనెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వచ్చి అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రుణానికి సంబంధించి తొలి విడత నిధులు విడుదలయ్యాయి. ఇటువంటి తరుణంలో మంత్రివర్గ భేటీలో అమరావతికి సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
* డీఎస్సీ ప్రక్రియ పూర్తి..
ఇంకోవైపు విద్యా సంవత్సరం ( academic year ) ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12 నాటికి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్కు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే నోటిఫికేషన్ ను గ్రాండ్ గా వెల్లడించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీతో దీనికి స్పష్టత రానుంది.
* తల్లికి వందనం నిధులు జమ..
మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనం(Thalliki Vandanam) అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే నెలలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున చదువుకు సాయం చేయనున్నారు. ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు, మార్గదర్శకాలు పైన కసరత్తు కొనసాగుతోంది. దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. ప్రాథమికంగా 69.16 లక్షల మంది పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే తల్లికి వందనం పథకం అర్హతకు 75% హాజరు తప్పనిసరి. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో సైతం తల్లికి వందనం పథకం పై క్లారిటీ ఇవ్వనున్నారు.
Also Read : అమరావతికి గ్రాండ్ ఎంట్రీ.. ఏపీ ప్రభుత్వ సరికొత్త ఆలోచన