AP Elections 2024: ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామని టిడిపి భావిస్తోంది. గట్టి అంచనాలే పెట్టుకుంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఉన్న ధీమా.. తరువాత రోజురోజుకీ సడలుతోంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో గెలుపు తప్పదని అంచనాలు వేశారు. కానీ అక్కడ పరిస్థితులు తారుమారైనట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రెబల్స్ ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు పై అనుమానాలు ఉన్నాయి. దీంతో టీడీపీ నేతలు అక్కడ తలలు పట్టుకుంటున్నారు. గెలిచే సీట్లు వదులుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.
పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ సీట్లను వదులుకుంది. అదే సమయంలో కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చింది. ఇలా మార్చిన చోట టికెట్ ఆశావాహులు రెబల్స్ గా మారారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. అయితే చాలా చోట్ల చంద్రబాబు కలుగజేసుకోవడంతో కొంతమంది వెనక్కి తగ్గారు. కానీ చాలామంది వినలేదు. దీంతో పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అయినా సరే టిడిపి సానుభూతిపరులు వారికి మద్దతు తెలిపినట్లు సమాచారం. దీంతో వారు చీల్చే ఓట్లు, వారి వెంట నడిచే క్యాడర్ బట్టి.. టిడిపి అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుంది.
ప్రధానంగా ఆరు నియోజకవర్గాల్లో టిడిపికి రెబల్స్ ఉన్నారు. అరకు నుంచి సివేరి అబ్రహం, విజయనగరం నుంచి మీసాల గీత, అమలాపురం నుంచి పరమట శ్యాం కుమార్, పోలవరం నుంచి ముడియం సూర్యచంద్రరావు, ఉండి నుంచి శివరామరాజు, సత్యవేడు నుంచి జడ్డ రాజశేఖర్ రెబల్స్ గా మిగిలారు. వీరిని తప్పించేందుకు చివరి నిమిషం వరకు టిడిపి నాయకత్వం ప్రయత్నించింది. వినకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ ఆరుగురు నేతలు నియోజకవర్గాల్లో కాస్తా పట్టు ఉన్నవారే. పదివేల ఓట్ల వరకు చీల్చే పరపతి ఉన్నవారే. ఆదిలో తెలుగుదేశం పార్టీ లైట్ తీసుకుంది.కానీ ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కలు కట్టిన తర్వాత.. ఓటమి తప్పదు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే కౌంటింగ్ ముందే ఆరు నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించకపోవడంతో.. పార్టీ శ్రేణులు ఆందోళన నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.