Sankranti Holidays: ఏపీలో విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. సంక్రాంతి సెలవులు కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో చాలా రోజులుగా తుఫాన్ల ప్రభావం అధికంగా ఉంది. వరుసగా భారీ వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దాని ప్రభావం సిలబస్ పై కనిపించింది. నిర్ణీత లక్ష్యంలో గా సిలబస్ను పూర్తి చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాజాగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో సంక్రాంతి సెలవులకు కుదింపు ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సంక్రాంతి సెలవులు కుదించకుండా ప్రత్యామ్నాయ మార్గాలైనా అన్వేషించాలి.. లేకుంటే విద్యాశాఖ ప్రతిపాదనలకు సమ్మతిస్తూ నిర్ణయం తీసుకోవాలి.
* విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు
ఏపీలో సంక్రాంతి కీలక పండుగ. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు తరలివస్తారు. పట్టణాల్లో తాత్కాలిక నివాసం ఉంటే ఉద్యోగులు, వ్యాపారులు సైతం సొంత గ్రామాలకు వెళ్తారు. సాధారణంగా 10 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండడంతో అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. ఈ ఏడాది విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు.. పది రోజులపాటు సెలవులు ప్రకటించారు. అయితే తాజాగా ఇప్పుడు సెలవుల్లో కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. ఇటీవల చాలా జిల్లాల్లో వర్షాలు కురిసాయి. ఆ సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆప్షనల్ హాలిడేస్ దృష్ట్యా.. ఆ సెలవులను సంక్రాంతి సెలవుల్లో సర్దుబాటు చేయాలన్నది విద్యాశాఖ ప్రతిపాదన.
* సిలబస్ పూర్తి కాకపోవడంతో
చాలాచోట్ల సిలబస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటికే పరీక్షల క్యాలెండర్ ఖరారు చేయడంతో.. సిలబస్ పూర్తి చేసేందుకు సంక్రాంతి సెలవులను పరిమితం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పది రోజుల సంక్రాంతి సెలవులు.. ఐదు రోజులకు కుదించే అవకాశం ఉంది. జనవరి 11 నుంచి 16 వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇస్తారని తెలుస్తోంది. అయితే ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ. పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే సెలవులకు సంబంధించి ప్రణాళికలు వేసుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో సెలవులకు అంటే ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే దీనిపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.