YS Jagan Mohan Reddy : జగన్ తరచూ మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారు? తరచూ మీడియాతో ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్ లో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. గత ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ మీడియాతో మాట్లాడింది అరుదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎడిటింగ్ వీడియోలను మీడియాకు విడుదల చేయడం పరిపాటిగా మారింది. ఎన్ని రకాల విమర్శలు వచ్చిన ఆయన మీడియా ముందుకు వచ్చింది చాలా తక్కువ. తన హయాంలో పెద్దపెద్ద ఘటనలు జరిగిన ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాలుగైదు సార్లు ప్రెస్ మీట్ లు పెట్టారు. మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థులపై మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాకు ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? అన్నదే ప్రధాన ప్రశ్న.అయితే సోదరి షర్మిలకు భయపడే ఆయన మీడియా ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఏదో అంశాన్ని పట్టుకొని మీడియాతో మాట్లాడుతున్నారు జగన్. వరద బాధితుల పరామర్శకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కేసులతో జైల్లో ఉన్న వైసిపి నేతలను పరామర్శించిన సమయంలో సైతం మీడియాను ఆశ్రయిస్తున్నారు. జగన్ లో వచ్చిన ఈ మార్పు మీడియా వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.
* తడబడుతున్న జగన్
ఇప్పటివరకు జగన్ మంచి వాగ్దాటి కలిగిన నాయకుడని అంతా భావించారు. కానీ మీడియా ముందుకు వచ్చే క్రమంలో ఆయన తడబడుతున్నారు. వరదలు వచ్చి ప్రజలు బాధపడుతుంటే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఈ విషయంలో షర్మిల బెటర్ అన్న టాక్ నడుస్తోంది. ఆమె చేసి విమర్శలు సూటిగా ఉంటున్నాయి. అదే సమయంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారు. జగన్ అలా కాదు. ఏదో మాట్లాడబోయి.. ఇంకేదో మాట్లాడుతున్నారు. చేతిలో పేపర్ లేకుండా ఏదీ చెప్పలేకపోతున్నారు. ఇది జగన్ లో ఉన్న లోపాన్ని బయటపెడుతోంది.
* బాధ్యతగా మహిళా నేత
వైయస్ షర్మిల ప్రజల ముందుకు వచ్చే క్రమంలో బాధ్యతగా మాట్లాడుతున్నారు.వరద బాధితుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తూనే చురకలు అంటిస్తున్నారు. చాలా బ్యాలెన్స్ గా ముందుకు వెళుతున్నారు. కానీ జగన్ విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. వరద బాధితుల కోసం ఆయన నిజంగా డిమాండ్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం లక్ష్యంగా కనిపిస్తోంది.
* సలహాలు ఇస్తూనే చురకలు
వరద బాధితుల కోసం కేవలం రెండుసార్లు రంగంలోకి దిగారు జగన్. వైసీపీ శ్రేణులను సైతం సమాయత్తం చేయలేదు. సహాయక చర్యల్లో పాల్గొనలేదు. కానీ షర్మిల మాత్రం అలా కాదు. నిత్యం వరద బాధితుల పరామర్శలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు. కానీ జగన్ మాత్రం ప్రభుత్వం పై విమర్శలకి పరిమితం అవుతున్నారు. అందుకే జగన్ కంటే షర్మిల బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నారు విశ్లేషకులు.