AP Election Survey 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మే 13న పోలింగ్ జరగనుంది. వైసిపి ఒంటరి పోరు చేస్తుండగా.. టిడిపి కూటమితో ముందుకెళ్తోంది. జనసేన, బిజెపితో జత కట్టింది. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు సైతం కూటమి కట్టాయి. అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ముఖాముఖి ఫైట్ వైసిపి, టిడిపి కూటమి మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వైసిపి ఓటు బ్యాంకు ను చీల్చుతుందున్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో గెలుపుపై ఎవరి ఆశలు వారికి ఉన్నాయి. ఇంతలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా న్యూస్ ఎక్స్ ఆంగ్ల వార్తా ఛానల్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్సభ సీట్ల వారీగా ఈ సంస్థ సర్వే చేపట్టింది. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు గాను మెజారిటీ సీట్లు టిడిపి కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది. టిడిపి సొంతంగా 14 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని.. బిజెపి, జనసేన చెరో రెండు స్థానాల్లో విజయం సాధిస్తాయని చెప్పుకొచ్చింది. మొత్తం ఎన్డీఏ కూటమి 18 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని.. వైసిపి ఏడు పార్లమెంట్ స్థానాలకి పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
ఈ లెక్కన ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 18 పార్లమెంట్ స్థానాలను ఎన్డీఏ గెలవనుండడంతో.. ఆ కూటమికి 126 అసెంబ్లీ సీట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బిజెపి గాలి బలంగా వీస్తోందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఏయే రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి ఎలా ఉంది? విపక్షాల పరిస్థితి ఏంటి? అనేదానిపై ఈ సర్వే పూర్తిగా అధ్యయనం చేసింది. అందులో భాగంగా ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు అని తేల్చి చెప్పింది. అయితే గత కొద్ది రోజులుగా వచ్చిన సర్వేల్లో ఎన్డీఏ కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే ఈ సర్వేలో మాత్రం అనుకూల ఫలితాలు రావడం ఉపశమనం కలిగించే విషయం.