Michael Slater: అతడు ఓ మాజీ క్రికెటర్.. ఆస్ట్రేలియా జట్టుకు ఆడాడు. పేరు మైఖేల్ స్లెటర్.. ఒక వయసు 54 ఏళ్ళు ఉంటుంది. అలాంటి ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. అతడిని అక్కడి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కట్టుకున్న భార్యను హింసించడం, మహిళల వెంట పడటం వంటి కేసులలో అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే అతనిపై 19 కేసులు నమోదయ్యాయి.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో సన్ షైన్ కోస్టులో స్లేటర్ నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12 వరకు పలు ఘాతుకాలకు పాల్పడ్డాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగట్టాడు. గృహహింసకు పాల్పడటం.. భయభ్రాంతులకు గురి చేయడం.. దొంగతనాలకు పాల్పడటం.. భౌతిక దాడులు చేయడం.. ఇలా పలు రకాల హింసాత్మక కార్యకలాపాలకు అతడు పాల్పడ్డాడు. దీంతో అతనిపై ఆస్ట్రేలియన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి మాత్రమే కాకుండా స్లేటర్ పలుమార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొండిగా వ్యవహరిస్తాడు, దూకుడుగా ఉంటాడు, ఎవరి మాటా వినడు అనే అభియోగాలు అతడి పై ఉన్నాయి. కోర్టు బెయిల్ నియమాలను సైతం తుంగలో తొక్కిన ఉదంతాలు అతనిపై ఉన్నాయి.
స్లేటర్ 1993లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాడు. మొత్తంగా 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. 42.83 సగటుతో 5,312 రన్స్ చేశాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా స్లేటర్ దూకుడుగా ఉండేవాడట. మైదానంలో తోటి ఆటగాళ్లకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదట. పైగా తాను బస చేసిన హోటళ్లల్లో మహిళా సిబ్బందిపై దురుసుగా వ్యవహరించే వాడట. అందువల్లే అతడి కెరియర్ అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగలేక పోయిందట. తాజాగా అతడి వయసు 50 ఏళ్లు దాటిపోయినప్పటికీ.. ఇప్పటికీ అదే తీరు కొనసాగిస్తుండడంతో సొంత భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.