Vijaysai Reddy: వైసీపీ కీలక నేత ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గళం ఎత్తనున్నారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత?నిజంగా దీక్ష చేస్తారా? లేకుంటే ఉత్త ప్రచారం నడుస్తోందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ.ఇటీవల ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. మూడు జిల్లాల బాధ్యతలను ఆయనకు అప్పగించారు జగన్. గతంలో విజయసాయిరెడ్డి పై విమర్శలు రావడంతో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోఆర్డినేటర్లను మార్చారు. ఉమ్మడి జిల్లాలను ఆరు రీజియన్లుగా విభజించి..తన సొంత వారిని నియమించుకున్నారు. జనసేన దూకుడు మీద ఉన్న ఉభయగోదావరి జిల్లాల బాధ్యతను మాత్రం అనుహ్యంగా బొత్స సత్యనారాయణకు అప్పగించారు. అయితే ఆయన విశాఖపై మనసు పారేసుకున్నారు.కానీ జగన్ మాత్రం విజయసాయిరెడ్డిని విశాఖకు పంపించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రాకను ఇక్కడ వైసిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి లో సైతం ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తోంది. మునుపటిలా ఇక్కడ వ్యవహరించలేమన్నది విజయసాయిరెడ్డి భావన. ఒకవైపు కూటమి ప్రభుత్వం నిఘా ఉంటుంది. మరోవైపు పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు విజయసాయిరెడ్డి. వస్తూ వస్తూ భారీ హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడాలని నిర్ణయించారు. కానీ ఏకంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని ప్రచారం ప్రారంభం కావడం విశేషం.
* వైసిపి హయాంలోనిదే ఈ వివాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పటిది కాదు. వైసిపి హయాంలోనే ఆ ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అప్పటి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో అడుగులు వేశారు. కానీ అప్పట్లో కేంద్రంతో వైసీపీకి సయోధ్య ఉండేది. రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలో కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. కేంద్ర పెద్దలతో సైతం మంచి సంబంధాలు ఉండేవి. అప్పట్లోనే ఆయన కేంద్రంతో మాట్లాడి ఉంటే ప్రైవేటీకరణ అంశం అప్పట్లోనే ముగిసిపోయేది. కానీ అప్పట్లో సమయాన్ని వృధా చేసి.. కేంద్ర ప్రభుత్వ చర్యలను చూసి అలానే ఉండిపోయారు. ఇప్పుడు ఎలా పోరాడుతారన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఒకవేళ పోరాటానికి దిగితే మాత్రం ఆయన చర్యలను నమ్మే స్థితిలో విశాఖ ప్రజలు లేరు. సొంత పార్టీలోనే నమ్మకం పొందలేరు.
* వాటి కోసమేనా?
గతంలో విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి చేసిన దందాలు ఆ పార్టీ నేతలకు సైతం తెలుసు. వాటిని కాపాడుకునేందుకే ఆయన తిరిగి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా వచ్చారన్నది ప్రధాన ఆరోపణ. అంతేతప్ప ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలు, ఉత్తరాంధ్రలో పార్టీలో మార్పులు, పూర్వ వైభవం వంటి వాటికి తావు లేదని సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే నమ్మే స్థితిలో మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు లేరు. మరి విజయసాయిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.