Amaravathi Capital : అమరావతికి కేంద్రం మరో గొప్పవరం.. ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మోడీ సర్కార్

అమరావతి రాజధానిపై కేంద్రం సైతం తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో కేటాయింపులు చేసింది. కీలక ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Written By: Dharma, Updated On : October 24, 2024 4:50 pm

Amaravathi Capital

Follow us on

Amaravathi Capital :  ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించింది. ఇందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం సైతం దక్కింది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి కొత్త కల ప్రారంభం అయ్యింది. టిడిపి కీలక భాగస్వామి కావడంతో కేంద్రం సైతం అదే వేగంతో స్పందించడం ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల్లో భాగంగా సర్దుబాటు చేసింది. అటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అమరావతిని సందర్శించింది. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకో వైపు రోడ్డు రవాణా, రైల్వే మార్గాలకు సంబంధించి కీలక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తూ వస్తోంది. ఇటీవలే సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఒకవైపు కేంద్ర సాయం విడుదల, ఇంకోవైపు కేంద్ర ప్రాజెక్టులతో అమరావతికి ఊపిరి ఊదినట్లు అయ్యింది. రెట్టింపు ఉత్సాహంతో పనులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే శాఖ తాజాగా తీపి కబురు అందించింది. అమరావతికి అనుసంధానంగా రైల్వే లైన్ ప్రాజెక్ట్ కు అనుమతిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

* 57 కిలోమీటర్ల రైల్వే లైన్
అమరావతి రాజధానిని అనుసంధానిస్తూ.. 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఇప్పటికే రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర క్యాబినెట్. రూ.2245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.దీనికోసం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ ఈ కొత్త లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు అమరావతిని అనుసంధానం చేసినట్లు అవుతుంది.

* ఏపీ సమగ్ర అభివృద్ధికి
ఏపీ సమగ్ర అభివృద్ధికి ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా ఈ లైన్ ను అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా ఈ లైన్ ను అనుసంధానం చేయనున్నారు. మరోవైపు ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయి. 19 పని దినాలు కల్పిస్తూ.. రైల్వే లైన్ కు ఇరువైపులా 25 లక్షల చెట్లు కూడా నాటనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా కాలుష్య నివారణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది కేంద్రం. మొత్తానికైతే అమరావతికి వరుస శుభవార్తలు అందుతుండడం విశేషం.