AP Chief Secretary: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈనెల 31 తో ముగియనుంది. ఈ క్రమంలో ఏపీ కొత్త సిఎస్ గా విజయానంద్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు విజయానంద్. వచ్చే ఏడాది నవంబర్ లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. అందుకే ఎంపిక చేశారు. విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నుంచి ఏపీ జెన్కో చైర్మన్ గా, 2023 నుంచి ఏపీ ట్రాన్స్కో సీఎండీగా ఉన్నారు. 1993లో అసిస్టెంట్ కలెక్టర్గా తన వృత్తిని ప్రారంభించారు. ఆదిలాబాద్ కలెక్టర్గా వ్యవహరించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ తో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా కూడా విధులు నిర్వహించారు. 2016 నుంచి 2019 వరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా, 2019 నుంచి ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవులు నిర్వర్తించారు. తరువాత ఏపీ జెన్కో, ట్రాన్స్కో బాధ్యతలు చూశారు.
* జాబితాలో సీనియర్లు
ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కానీ వారంతా ఇంకా కొంతకాలం సర్వీసులో ఉండడంతో.. వచ్చే ఏడాది రిటైర్ కానున్న విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. వాస్తవానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. సీనియర్ జాబితాలో సైతం ఆమె ముందు వరుసలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆమె రిజర్వులో ఉన్నారు. వైసిపి హయాంలో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నేపథ్యంలో.. ఆమెను లుప్ హోల్స్ లో పెట్టారు.
* సాయి ప్రసాద్ పేరు
అయితే ముందుగా జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈయన సర్వీసు 2026 వరకు ఉంది. విజయానంద్ సర్వీసు మరో 10 నెలల్లో ముగియనుంది. అందుకే విజయానంద్ కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. జనవరి 1న ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2025 నవంబరు 30 వరకు ఆ పదవిలో ఆయన కొనసాగనున్నారు.