YS Viveka: ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య ప్రధాన పాత్ర పోషించనుంది. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఘటన వైసీపీకి సానుభూతి తెచ్చింది. ఎన్నికల్లో గెలుపునకు ఒక కారణంగా నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతికూల ప్రభావం చూపనుంది. గత ఐదు సంవత్సరాలుగా వివేక కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. జగన్ సోదరి షర్మిల సునీతకు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వివేక భార్య సౌభాగ్యమ్మ కూడా తెరపైకి రావడం విశేషం.
కొద్ది రోజుల క్రిందట వైయస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. వివేకా హత్య కేసులో జగన్ ను సైతం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నారని కూడా తేల్చి చెప్పారు. వీటన్నింటిపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ఇప్పుడు వివేక ఐదో వర్ధంతి సందర్భంగా సౌభాగ్యమ్మ ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివేకా హత్య కేసులో హంతకులను జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. వివేక హత్య గురించి జగన్ కు ముందే తెలుసునని తేల్చి చెప్పారు. న్యాయం కోసం వెళితే కుమార్తె సునీత, అల్లుడి పై నేరం మోపాలని చూశారని చెప్పుకొచ్చారు. జగన్ సహకరించకపోవడంతోనే సునీత ఒంటరి పోరాటం చేయడం ప్రారంభించారని గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటేయొద్దని ఏపీ ప్రజలకు సౌభాగ్యమ్మ పిలుపునివ్వడం విశేషం. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. వివేక హత్య ఘటన జగన్ తో పాటు ఆయన భార్య భారతికి కూడా తెలుసన్నారు. ఇంటి శత్రువు గురించి తెలుసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా ఆయన వద్దకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ విడిగా మాట్లాడకుండా ఇతరులను తన దగ్గర పెట్టుకుని మాట్లాడారని తెలిపారు. నిందితులను పక్కన పెట్టుకొని.. సునీత, ఆమె భర్తపై అనుమానపు చూపులు చూశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చాలని ప్రశ్నించారు. జగన్ సహకరించకపోవడం వల్లే సునీత న్యాయపోరాటం ప్రారంభించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. భర్తను కోల్పోయి బాధలో ఒకవైపు.. న్యాయం కోసం పోరాడుతున్న సునీత బాధను చూసి మరోవైపు కుమిలి పోయానని సౌభాగ్యమ్మ తన ఆవేదనను వ్యక్తపరిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన జగన్ ను సీఎం చేయాలన్న పట్టుదలతో వివేకానంద రెడ్డి చేశారని.. కానీ రాజకీయాల కోసమే ఆయనను పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. మొత్తానికి అయితే ఎన్నికల ముంగిట ప్రజాక్షేత్రంలో వివేకానంద రెడ్డి కుటుంబం అడుగు పెట్టడం విశేషం. ఎన్నికల్లో ఇది జగన్ కు ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.