Sankranthi Special: సంక్రాంతి అంటే గంగిరెద్దులు, హరిదాసులు, ఇళ్లకు వచ్చిన పాడిపంటలు, నట్టింట్లో సందడి చేసే ఆడపడుచులు, వాకిళ్లను వర్ణ రంజితం చేసే ముగ్గులు, ఆకాశానికి సరికొత్త సొబగులు అద్దే గాలిపటాలు, కడుపు నింపే పిండి వంటలు.. ఈ వరుసలో ఏదో మిస్ అవుతోందా?! ఎస్… అవే కోడిపందాలు. తెలంగాణ ప్రాంతానికి తక్కువ పరిచయం కానీ.. ఆంధ్రాలో సంక్రాంతి అంటేనే కోడిపందాలు. ఈ కోడిపందాలలో పోటీలో పాల్గొనే కోడిపుంజులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాటి పెంపకమే ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ కోడిపందాలు నిన్న మొన్నటి వరకు ఊరికి దూరంగా ఎక్కడో మామిడి తోపుల్లోనో, పామాయిల్ తోటల్లోనో జరిగేవి.. ఈ పందాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా బిర్రులు ( మైదానాలు) ఏర్పాటు చేస్తారు. అందులో కూడా గుండాట, కోడి కత్తి ఆట, అనే పేర్లతో పందాలు నిర్వహిస్తారు. ఈ పందాల వల్ల చుట్టూ జన సందోహం, ఎక్కడా లేని హడావిడి, పోలీసుల దాడులతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త విధానానికి తెరదీశారు.

ఆన్లైన్లో కోడిపందాలు
ప్రస్తుతం మనం టెక్ యుగంలో ఉన్నాం ఎఫ్ బీ, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. సరిగా వీటినే కోడిపందాల నిర్వాహకులు తమకు అనువుగా మార్చుకున్నారు. వీటి ఆధారంగా ఆన్లైన్ కోడిపందాల నిర్వహణకు తెర తీశారు. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలో పండుగ రోజుల్లోనే కోడిపందాలు జరుగుతాయి. వీటికి అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు మామూలు రోజుల్లోనూ కోడిపందాలు నిర్వహించేందుకు పురి గొల్పారు. దీంతో ఆ జిల్లాల్లో మామూలు రోజుల్లోనూ ఎక్కడో ఒకచోట కోడిపందాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయన్నట్టు… ఆ ఆలోచనలకు ప్రతి రూపమే ఆన్లైన్ కోడిపందాలు. మారుమూల గ్రామాలు దాటి ఇప్పుడు అవి పట్టణాలను తాకాయి.. స్నేహితులు, వాళ్ల ద్వారా పరిచయమైన వారు, బంధువుల ద్వారా విదేశాలకూ చేరాయి.. పోలీసులకు దొరకకుండా ఏడాది పొడవునా పందాలు నిర్వహిస్తున్నారు. వందలు, వేలు, లక్షలు దాటి ఇప్పుడు పందాల విలువ కోట్లకు చేరింది.

ఎవరికీ దొరకకుండా
నిర్వాహకులు ఆన్లైన్లో పందాలు నిర్వహించేందుకు అసలు కారణం పోలీసులు దాడులు.. వారికి దొరకకుండా ఉండేందుకు మారుమూల గ్రామాల్లో పందాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీటి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఆ గ్రూపులను బిట్ కాయిన్, ఆన్లైన్ రమ్మీ తదితర పేర్లతో క్రియేట్ చేస్తున్నారు.. ఇక ఒక గ్రూపులో ఐదు వేల మంది దాకా ఈ పందాలను లైవ్ గా చూస్తారు.. ఇక చూసేవారిలో సగం మంది పందాలు కాసినా నిర్వాహకులకు రోజూ లక్షల్లో ఆదాయం వస్తుంది. కొందరైతే రోజుకు నాలుగు నుంచి 12 వరకు పందాలు నిర్వహిస్తున్నారు..

ఊరు చివర..
మారుమూల గ్రామాల్లో ఊరికి చివర పందాలు నిర్వహిస్తున్నారు.. ఎవరికి ఎటువంటి అనుమానాలు రాకుండా కోడి కత్తికి పని చెప్పేస్తున్నారు. ఇక ఈ పందాలను చైన్ లింక్డ్ స్నేహితులకు, పరిచయస్తులకు తొలుత వీడియో కాల్ చేసి పందాలను మొదలు పెడతారు. వేర్వేరు రంగుల్లో ఉండే కోడిపుంజులను పందాలకు ఎంచుకుంటారు.. వాటిలో దేనిపై అయినా పందాలు వేయవచ్చు. 1000కి ఒక శాతం కమిషన్ తో మధ్యవర్తులు ఈ పందాలను నిర్వహిస్తారు.. ముందే బెట్టింగ్ డబ్బులను ఆన్లైన్ పేమెంట్ ల ద్వారా వసూలు చేస్తారు. వాట్సప్ గ్రూప్ నుంచి ఒకేసారి వందమంది వీడియో కాల్ లో ఈ పందాలు చూడవచ్చు. ఈ పందాలు కాసేవారిలో విద్యార్థులు, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఉన్నారు.. ముందస్తు ఒప్పందం ప్రకారమే డబ్బుల పంపిణీ జరిగిపోతుంది.. ఇక ఈ పందాలు విదేశాలకు కూడా పాకాయి.

టెక్నాలజీని వాడుకుంటున్నారు
గతంలో కోడిపందాలు నిర్వహిస్తే పోలీసులు దాడులు చేసేవారు.. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు నిర్వాహకులకు తలకు మించిన భారం అయ్యేది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆ నిర్వహకులు టెక్నాలజీని వాడుకోవడం ప్రారంభించారు.. దీంతో మూడో కంటికి తెలియకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. నలుగురు వ్యక్తుల అవసరం కూడా లేకుండా, ఎప్పుడు,ఎక్కడ, ఎలా జరుగుతాయో కూడా తెలియకుండా కథ నడిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఓడిపోయిన వ్యక్తులు కేసులు పెట్టాలన్నా సైబర్ పోలీసులు వెతికి పట్టుకునే లోపు చిరునామాలు, ఫోన్ నెంబర్లు మార్చేస్తున్నారు.
