Sakshi Media: ఏపీ సీఎం జగన్ తనకు మీడియా సపోర్ట్ లేదని చెబుతారు. టిడిపి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నాకు లేవంటూ చెప్పుకొస్తున్నారు. కానీ తనకు సాక్షి మీడియా ఉందని మరిచిపోతున్నారు. ఈ విషయంలో గజిని సినిమాలో హీరో తరహాలో వ్యవహరిస్తున్నారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా వందల కోట్ల రూపాయలు సాక్షి మీడియాకు వివిధ రూపాల్లో ఆయాచిత లబ్ధి చేకూర్చారు. నిన్నటికి నిన్న తన పుట్టినరోజు వేడుకలకు వివిధ శాఖల యాడ్ల రూపంలో దాదాపు రూ.100 కోట్లు సాక్షి ఖాతాకు మళ్లీనట్లు తెలుస్తోంది.
ఏదైనా సంక్షేమ పథకం ప్రకటించాలంటే యాడ్, ఆ పథకం ముందు రోజు మరో యాడ్, పథకం ప్రారంభించిన రోజు ఒక యాడ్.. ఇలా ప్రకటనల రూపంలో సాక్షికి వందల కోట్ల రూపాయలు చేరుతున్నాయి. బటన్ నొక్కిన చాలా రోజుల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుండగా.. ఇలా యాడ్ వేసిన మరుక్షణమే సాక్షి ఖాతాకు మాత్రం నగదు చేరుతుంది. ఇక వారం వారం జిల్లా సంచికల్లో ఇసుక ధరలు, ప్రభుత్వ పథకాలు, నియామక నోటిఫికేషన్ గురించి చెప్పనక్కర్లేదు. ఆపై కార్పొరేట్ సంస్థల యాడ్లు, క్విడ్ ప్రో ద్వారా లబ్ధి పొందిన సంస్థలు ఆయాచితంగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి. వీటన్నింటి రూపంలో వందల కోట్ల రూపాయలు సాక్షి ఖాతాల్లో చేరుతున్నాయి.
అత్యధిక సర్కులేషన్ పత్రిక అని అనిపించేందుకు.. వలంటీర్ల రూపంలో ఏకంగా రెండున్నర లక్షల పత్రికలు అమ్ముడయ్యేలా ప్లాన్ చేశారు. ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వలంటీర్లకు పరోక్షంగా జీవో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 260,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వారికి పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీర్ కు రూ.200 మంజూరు చేశారు. ఇక పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించేలా కొన్ని రకాల పోస్టులు క్రియేట్ చేశారు. నామినేట్ పదవులు కేటాయించారు. వారికి సాక్షి యాజమాన్యం కాకుండా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేశారు. ఏటా జగన్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు. ఈ ఏడాది కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో సాక్షి సంపాదించుకున్నట్లు సమాచారం. జీతాల కోసం, తమ జీవితాల కోసం ఉద్యోగులు, కార్మికులు ఓవైపు ఉద్యమ బాట పడుతుంటే.. ఒకే రోజు వందల కోట్ల రూపాయల ఆర్జనతో సాక్షి ముందుండడం విశేషం.