Rushikonda Palace: అమ్మకానికి రుషికొండ ప్యాలెస్.. కొనుగోలుకు ఓ వ్యక్తి ఆసక్తి

రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్ వాస్తవాలు దాచింది. ఆ నిర్మాణాలు ఎందుకు చేపట్టారో బయటకు వెల్లడించలేదు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అన్న విమర్శ ఉంది.

Written By: Dharma, Updated On : June 22, 2024 5:40 pm

Rushikonda Palace

Follow us on

Rushikonda Palace: రుషికొండలో వైసీపీ సర్కార్ అద్భుత కట్టడాలు నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని నిర్మించినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రతి నిర్మాణం అద్భుతమే. దీనిపై అధికార ప్రతిపక్షం మధ్య రచ్చ కొనసాగుతుండగా.. ఎలా వాడుకోవాలన్నది చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా ఈ ప్యాలెస్ ను తాను కొనుగోలు చేస్తానని సుకేష్ చంద్ర ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. అంతేకాదు తాను పంపిస్తున్న ఈ లేఖను ఒప్పందంగా భావించాలి అని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ ప్యాలెస్ కు ఎంత ధర పెట్టినా దానిపై 20 శాతం చొప్పున అదనంగా తాను చెల్లించి కొనుగోలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ అమ్మడం ఇష్టం లేకుంటే కనీసం లీజుకు ఇవ్వాలని కోరారు.

అయితే ఇప్పుడు సుఖేష్ చంద్ర ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ కుంభకోణం నిందితుల్లో సుఖేష్ చంద్ర ఒకరు. మనీ లాండరింగ్ కేసులు ఆయనను ఈడి అరెస్టు చేసింది. ఆయన జైలు నుంచే తీవ్ర వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ.. రాజకీయంగా దుమారం రేపుతున్నారు. తాజాగా రుషికొండ ప్యాలెస్ కొనుగోలు చేస్తానని.. తనకు మాత్రమే అమ్మాలని నేరుగా సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాయడం విశేషం. అంతటితో ఆగకుండా ఆయన తనకు విశాఖ తో అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. బాల్యం ఎక్కువగా విశాఖలో గడిచింది అన్నారు. విశాఖ తో పాటు ఆర్కే బీచ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని లేఖలో వివరించారు.

రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్ వాస్తవాలు దాచింది. ఆ నిర్మాణాలు ఎందుకు చేపట్టారో బయటకు వెల్లడించలేదు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అన్న విమర్శ ఉంది. పర్యాటక చరిత్ర ఉన్న భవనాలను తొలగించి 500 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మూడంచెల భద్రత వ్యవస్థ నడుమ రుషికొండ నిర్మాణాలు సాగాయి. అటువైపుగా కాకి వాళ్లే పరిస్థితి కూడా లేదు. కానీ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ నిర్మాణాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలామందిని తీసుకెళ్లి రుషికొండ నిర్మాణాలను బయటపెట్టారు. అప్పటినుంచి వివాదం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే సుఖేష్ చంద్ర ఈ లేఖ రాశారు.