Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీని వీడనుందా? పార్టీ మారనుందా? బిజెపిలో చేరనుందా? ఇప్పుడు ఎక్కడ చూడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. కాంగ్రెస్ లో రాణించిన ఆయన వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. అయితే ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో.. పెద్దిరెడ్డి కుటుంబం బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయినా బిజెపి నుంచి అంతగా సానుకూలత రావడంలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై మాట్లాడిన బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చారు. పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బిజెపి హై కమాండ్ కు టచ్ లోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.
వైసిపి ఈసారి కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిగతా ఏడుగురు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. దీంతో వైసీపీలో ఒక రకమైన ముసలం ప్రారంభం అయింది. కీలక నేతలు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐదేళ్ల కాలం వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే తన తండ్రి రామచంద్ర రెడ్డి ని కూడా తన వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ హవా నడిచింది. సీనియర్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ రాజకీయాలను శాసించారు. అత్యంత ఆత్మీయుడుగా ఎంపీ మిధున్ రెడ్డి వైసీపీ వ్యవహారాలను చూశారు. చివరకు వైసీపీలో టికెట్ల బాధ్యతను కూడా మిధున్ రెడ్డికి అప్పగించారు జగన్. ఒకానొక దశలో పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత మిధున్ రెడ్డి తీసుకున్నారు. అటు వ్యాపారాలు, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు పెద్దిరెడ్డి కుటుంబం పై ఆరోపణలు ఉన్నాయి.ఇటీవల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది.
ప్రస్తుతం వైసీపీ శాసనసభ పక్ష నేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. సహజంగానే చంద్రబాబుకు ప్రత్యర్థి కావడంతో పెద్దిరెడ్డి టార్గెట్ అవుతారు. గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం కేసులు, అరెస్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఐదేళ్ల పాటు పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుందని.. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని మిధున్ రెడ్డి గ్రహించారు. అందుకే ఆయనబిజెపి అగ్రనేతలకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.అయితే బిజెపి నుంచి అంత సానుకూలత కనిపించడం లేదని సమాచారం. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై మిధున్ రెడ్డి గెలిచారు. దీంతో మిధున్ రెడ్డి చేరికను కిరణ్ సైతం అడ్డుకుంటారు. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యంగా ఉండడంతో చంద్రబాబు నుంచి సైతం అభ్యంతరాలు ఉంటాయి. ఈ తరుణంలో పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో చేరే చాన్స్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.