Avinash Reddy: కడపలో బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకు అక్షరాల రూ.12.50 కోట్లు

వైసీపీ నేతగా చలామణి అవుతున్న అవినాష్ రెడ్డి బావ పులివెందులలో ఎకరానార స్థలంలో ఒక వెంచర్ వేశారు. అక్కడ స్థలం విలువ అంతంత మాత్రమే. అక్కడ వేసిన పిల్లర్లు, స్లాబ్ ఖర్చు రెండు కోట్లు కూడా చేయదు.

Written By: Dharma, Updated On : July 4, 2024 11:20 am

Avinash Reddy

Follow us on

Avinash Reddy: వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తి లో ఉన్నా.. పంచభక్ష పరమాన్నాలు దక్కుతాయి. అందుకే వైసిపి ఏలుబడిలో అస్మదీయులకు వ్యవస్థలను కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కడపలో అయితే చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం అన్నట్టు వ్యవహారాలు నడిచాయి. పులివెందులలో అవినాష్ రెడ్డి సొంత బావ ఓ వెంచర్ వేసి బిల్డింగ్ కట్టడం ప్రారంభించారు. కనీసం రెండు కోట్ల రూపాయల కూడా చేయని బిల్డింగ్ ను.. రూ.12 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది పర్యాటక శాఖ. అంటే ఒకరోజు ఒప్పందంతో అవినాష్ రెడ్డి బావకు చేకూర్చిన ఆదాయం అక్షరాల 10 కోట్ల రూపాయలు.

వైసీపీ నేతగా చలామణి అవుతున్న అవినాష్ రెడ్డి బావ పులివెందులలో ఎకరానార స్థలంలో ఒక వెంచర్ వేశారు. అక్కడ స్థలం విలువ అంతంత మాత్రమే. అక్కడ వేసిన పిల్లర్లు, స్లాబ్ ఖర్చు రెండు కోట్లు కూడా చేయదు. వాస్తవానికి ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేవారు కూడా తక్కువే. కనీసం అద్దెకు ఉండేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అక్కడ బిల్డింగ్ కట్టడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇలా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఏకంగా పర్యాటక శాఖతో కొనుగోలు చేయించారు అప్పటి కలెక్టర్. పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ కట్టేందుకు సగం కట్టిన భవనం రెడీగా ఉందని.. రెండున్నర ఎకరాల్లో ఉందని కడప జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖకు ప్రత్యేక రిక్వెస్ట్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో పర్యాటక శాఖ అధికారులు రూ.12.50 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు.ఏకంగా అవినాష్ బావ ఖాతాలో పదిన్నర కోట్ల రూపాయల ఆదాయం చేరిపోయింది.

వాస్తవానికి అక్కడ భవనం కట్టింది ఎకరం నర స్థలంలోనే. అయితే కలెక్టర్ మాత్రం రెండున్నర ఎకరాల్లో ఉందని చెప్పడం విశేషం. అంతస్థలం లేకున్నా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు రావడంతో పర్యాటక శాఖ అధికారులు కొనేశారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన ఈ ఆదాయాన్ని గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు ఎలా పంచుకున్నారు ఈ ఘటన తెలియజేస్తోంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఖజానా అంటే తమ సొంత సొమ్ముగా భావించి.. వైసీపీ పాలకులు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ దారుణాలు బయటపడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.