https://oktelugu.com/

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ లో కొత్తకోణం.. ఆ అధికారుల ఫోన్ల పై కూడా నిఘా పెట్టిన నాటి ప్రభుత్వ పెద్దలు..

ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

Written By: , Updated On : July 4, 2024 / 12:01 PM IST
Phone Tapping

Phone Tapping

Follow us on

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నాటి ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావుకు కూడా పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు, నవీన్ రావ్ సూచనలతో నాడు అప్పటి డిఎస్పి ప్రణీత్ రావు బృందం ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ బృందం రాజకీయ నాయకులవి మాత్రమే కాకుండా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపై కూడా నిఘా పెట్టారని సమాచారం.

ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో అనేక అంశాలను వెల్లడించారు. ” ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మాస్టర్ మైండ్. ఈ కేసును ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయాలి. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ను విచారించడం అత్యంత ముఖ్యం. ఇంటర్ పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయిన తర్వాత ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్ట్ లను జప్తు చేయాలని రీజినల్ పాస్ పోర్ట్ అథారిటీకి ప్రతిపాదించాం. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి.. కీలక సమాచారాన్ని, ఎస్ఐబీఐకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్ లను నిందితులు ధ్వంసం చేశారు. కీలకమైన సమాచారాన్ని నాశనం చేశారని” దర్యాప్తు బృందం అధికారులు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

నాడు కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావ్, ఇతర భారత రాష్ట్ర సమితి నాయకుల ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులపై ప్రభాకర్ రావు ఒత్తిడి తెచ్చారు. సారనాల శ్రీధర్ రావు పై క్రిమినల్ కేసులు పెట్టించారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలనూ ప్రణీత్ రావు బృందం ఇంటర్ సెప్ట్ చేసింది. ఈ మాడ్యూల్ ను ఆర్ఆర్ అనే పేరుతో వ్యవహరించింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రొఫైల్స్ సృష్టించి.. ప్రణీత్ రావు ఆ సమాచారాన్ని తన ల్యాప్ టాప్ లో స్టోరేజ్ చేశారు. ఆ సమాచారంతో ఉన్న హార్డ్ డిస్క్ ను తన బావమరిది దిలీప్ అండదండలతో రీ-ప్లేస్ చేశారు. అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్ ను బేగంపేట నాలాలోకి విసిరేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్లను ఫార్మాట్ చేసుకున్నారు.

ఇక 2022 అక్టోబర్ లో వెలుగులోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటికి వచ్చింది. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజి స్వామి తో కోరే నందకుమార్ తో మాట్లాడిన ఫోన్ కాల్స్ ను ప్రణీత్ రావు అక్రమంగా విన్నారు. ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకు అందించారు. ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రసారమైంది.. అయితే ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి 22న శ్రవణ్ రావు ఇంట్లో దర్యాప్తు అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాలలో సోదాలు చేశారు. డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను జప్తు చేశారు. మార్చి 23న ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. ప్రభాకర్ రావు వ్యక్తిగత భద్రతా సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ తీసి ప్రణీత్ రాకు పంపించినట్టు తెలుస్తోంది.