Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో పోలీసులు వెనక్కి తగ్గారా? దర్యాప్తు బృందాలకు చిక్కని ఆయన..బుల్లితెరపై ఎందుకు ప్రత్యక్షమవుతున్నట్టు? నేరుగా ఎలా ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టు?ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపి అధినేత జగన్ రాజకీయ జీవితం ఇతివృత్తంగా చేసుకుని గతంలో ఆర్జీవి వ్యూహం అనే సినిమాను తీశారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు,లోకేష్ కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టింగ్లు పెట్టారు. అప్పట్లో అది వివాదంగా మారింది. కానీ వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరు ఫిర్యాదులు చేయలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదులు పెరిగాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే నాడు ఆర్జీవి పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటినుంచి రచ్చ ప్రారంభం అయింది. కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆర్జీవికి నోటీసులు అందించారు. కానీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ ఆర్జీవి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తలుపు తట్టారు. కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ కొట్టి వేసింది. దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఆర్జీవి. ఈ తరుణంలో విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆర్జీవిని అరెస్టు చేయడానికి రంగంలోకి దిగారు. ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో ఆచూకీ లేకుండా పోయింది. కానీ ఆర్జీవి మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తాను భయపడలేదని.. ఎక్కడికి వెళ్లి పోలేదని చెప్పుకొచ్చారు. తాను ఉన్న ప్లేస్ మాత్రం వెల్లడించలేదు.
* మీడియాకు ఇంటర్వ్యూలు
అయితే ఒకవైపు పోలీసులకు చిక్కని ఆయన మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.పోలీసులకే తిరిగి సలహాలు ఇస్తుండడం విశేషం.పోలీస్ చర్యలను ప్రశ్నిస్తూ.. విచారణ అలా జరగాలి? కేసులు ఇలా నమోదు చేయాలి? అంటూ తెగ సలహాలు ఇస్తున్నారు. అయితే తమకు దొరకని ఆర్జీవి మీడియా సంస్థలకు ఎలా అందుబాటులోకి వచ్చారన్నది పోలీసులకు ఎదురవుతున్న ప్రశ్న. అదే సమయంలో పోలీసుల వైఖరిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
* పోకిరి సీన్
రాంగోపాల్ వర్మ తీరు అచ్చం పోకిరి సినిమాలో విలన్ మాదిరిగా ఉంది. హత్యలు చేసే విలన్ ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తారు. అదే విషయంపై మీడియాను కార్నర్ చేస్తూ మాట్లాడుతారు షియాజీ షిండే. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఆర్జీవి మాట్లాడుతుండడం విశేషం. గంటల తరబడి స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇచ్చే రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కకపోవడం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఆర్జీవిని అరెస్టు చేయకపోవడం అనేది పోలీసుల వ్యూహమా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.